జాతీయ వార్తలు

సోనియా-మాయా సమావేశం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ రెండోసారి అధికారంలోకి వస్తారని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించటంతో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. హంగ్ పార్లమెంటు ఏర్పడే పక్షంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు సోనియా గాంధీ, మాయావతి ఢిల్లీలో సమావేశం కావాలనుకున్నారు. మాయావతి సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న వెంటనే 10 జనపథ్‌కు వెళ్లి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కావలసి ఉండింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహం మేరకు ఈ సమావేశం ఏర్పాటయింది. అయితే ఆదివారం వివిధ మీడియా సంస్థలు ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి రానున్నట్లు అంచనా వేయటంతో మాయావతి ఆలోచనా విధానం మారిపోయింది. ఎన్‌డీఏకు మెజారిటీ వచ్చే పక్షంలో తాము కలిసి ఏం చర్చిస్తామన్నది మాయావతి ప్రశ్న. ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్, బీఎస్పీ ఎన్నికల అనంతరం కలిసి పని చేయాలనుకున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి ఓటు వేయటంతో మాయావతి ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని మహాకూటమి భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ కూటమి దాదాపు యాభై సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయటం తెలిసిందే. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు నిజంగానే బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏకు పోతున్నాయా? అనేది ఇరువురు నాయకులు సమీక్షించినట్లు తెలిసింది. మెజారిటీ సీట్లు తమకు వస్తాయనుకుంటే బీజేపీ వాటిని తన్నుకుపోవటం ఏమిటన్నది ఇరువురు నాయకుల ప్రశ్న. మాయావతి, అఖిలేష్ యాదవ్ దాదాపు గంటసేపు లోక్‌సభ ఫలితాలపై సమీక్షించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశానంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవటం గమనార్హం.
ఇదిలావుంటే సోనియా గాంధీ నిర్వహించాలనుకున్న ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశం 23కు బదుల 24వ తేదీన నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 23వ తేదీనాడు వెలువడే ఫలితాల సరళిని బట్టి సమావేశం జరపాలా లేదా అనేది నిర్ణయిస్తారని అంటున్నారు. సమావేశం జరపవలసిన అవసరం వస్తే 24న జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

చిత్రం... బీఎస్పీ అధినేత్రి మాయావతి నివాసానికి వెళ్లి సమావేశమైన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్