జాతీయ వార్తలు

ఫలితాలు తేలాకే తదుపరి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: తాజా లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలకు పరాజయమేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడైన నేపథ్యంలో ఈ పార్టీల నేతలు తదుపరి వ్యూహంపై దృష్టి సారించారు. ఫలితాలు ఇలాగే ఉండే పక్షంలో యూపీఏతో చేతులు కలపాలా? లేక కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పని చేయాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కు 14-16 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అలాగే ఎల్‌డీఎఫ్ 4-6 స్థానాలు, బీజేపీకి ఒక సీటు వస్తుందని స్పష్టం చేశాయి. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలకు ఒక్క స్థానం కూడా రాదని ఈ అంచనాలు వెల్లడి కావడంతో ఈ పార్టీల నేతలు ఇరకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలోని తమ భవిష్యత్తు వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగేస్తున్నారు. 23న లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రతిపక్ష కూటమి ఏర్పాటు కావడం, దానికి అనుగుణంగానే వ్యూహంపైనే కసరత్తు జరుగుతుంది కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టే వామపక్షాలు తదుపరి అడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో లౌకిక, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని, అయితే ఇందుకు ఎవరు సారథ్యం వహిస్తారు? ఆ ఏర్పాటు అంశాలు ఏలా ఉంటాయనేది తేలాల్సి ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏ పార్టీకి మెజారిటీ దక్కని పక్షంలో తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో తమ జాతీయ కార్యనిర్వాహక కార్యవర్గం సమావేశం అవుతుందని, అందులోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే వామపక్షాలకు ఇంతకు మించిన ఘోరపరాజయం ఉండదని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. ఈ పరిస్థితుల్లో వామపక్షాల పాత్ర ఏమిటన్నది 23 తర్వాతే తేలుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మత శక్తులు అధికారంలోకి రాకుండా నిరోధించేందుకే తాము కృషి చేస్తామని సీపీఐకి చెందిన మరో కార్యదర్శి అతల్‌కుమార్ అంజన్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలా లేక కాంగ్రెస్ సారథ్యంలోని ఫ్రంట్‌లో చేరాలా అనేది అప్పుడే నిర్ణయించుకుంటామని అన్నారు. అన్ని వామపక్షాలు కలిసే తమ తదుపరి వ్యూహాన్ని నిర్ధేశించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.