జాతీయ వార్తలు

నోటాకు భారీగా ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ జైపూర్/ చండీగఢ్, మే 24: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ తమకు నచ్చలేదని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా బిహార్, డామన్ అండ్ డైయూ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానాల్లో వేలాది మంది ఓటర్లు ఇలా ‘నోటా’కు ఓటేశారు. 2013లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చనట్లయితే, ఆ విషయాన్ని ఓటరు ప్రకటించడానికి ఒక ‘నోటా’ బటన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. అంటే మొత్తం పోలయిన ఓట్లలో 1.1 శాతం మంది నోటాకు ఓటేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా బిహార్‌లో 8.17 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు దేశంలోనే అత్యధికంగా బిహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 (5.04 శాతం) మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, బిహార్‌లో మొత్తం పోలయిన ఓట్లలో రెండు శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. డామన్ అండ్ డైయూలో 1.7 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1.49 శాతం మంది, చత్తీస్‌గఢ్‌లో 1.44 శాతం మంది నోటాకు ఓటేశారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్‌లో సుమారు 3.27 లక్షల మంది ఓటర్లు, పంజాబ్‌లో 1.54 లక్షల మంది, ఢిల్లీలో 45వేల మంది ఓటర్లు, హర్యానాలో 41వేల మంది ఓటర్లు ‘నోటా’ ఐచ్ఛికాన్ని ఎంచుకున్నారు. రాజస్థాన్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రీతిలో 3,27,902 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా నోటాకు పోలయిన ఓట్లు సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ వంటి పార్టీలకు పోలయిన ఓట్ల కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాజస్థాన్‌లో సీపీఐకి 0.14 శాతం, సీపీఎంకు 0.20 శాతం, బీఎస్‌పీకి 1.07 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో బన్స్వారా నియోజకవర్గంలో అత్యధికంగా 29,962 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 6,200 మంది ఓటర్లు ఎక్కువగా నోటాను ఎంచుకున్నారు. ఈసారి మొత్తం ఓట్లలో 0.53 శాతం ఓట్లు నోటాకు పోలయ్యాయి. నైరుతి ఢిల్లీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో అత్యధికంగా 10,210 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. పంజాబ్‌లో 1,54,323 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఇక్కడ పోలయిన మొత్తం ఓట్లలో 1.12 శాతం నోటాకు పోలయ్యాయి. హర్యానాలో 41వేల మందికి పైగా ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. మొత్తం పోలయిన ఓట్లలో 0.68 శాతం నోటాకు పోలయ్యాయి. అంబాలా నియోజకవర్గంలో అత్యధికంగా 7,943 మంది నోటాకు ఓటేశారు.