జాతీయ వార్తలు

కోల్‌కతాలో కూలిన ఫ్లైఓవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 31: నగరంలో రద్దీగా ఉండే కూడలిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌లో కొంతభాగం గురువారం మధ్యాహ్నం కూలిపోవడంతో కనీసం 18 మంది మరణించగా, మరో 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 23గా అనధికారిక వార్తలు పేర్కొంటున్నాయి. కూలిపోయిన ఫ్లైఓవర్ శకలాల కింద వాహనాలు నుజ్జు నుజ్జు కాగా, జనం, చిరువ్యాపారులు పలువురు చిక్కుకు పోయారు. కాగా, ఇది దైవనిర్ణయం తప్ప మరోటి కాదంటూ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐవిఆర్‌సిఎల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అధికారి పాండురంగా రావు చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల విమర్శలకు గురయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జరిగిన ఈ ప్రమాదం అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఆత్మ రక్షణలో పడేసింది.
నగరంలోని అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ ఉన్న బుర్రా బజార్ ప్రాంతంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పోలీసులు చెప్పారు.
గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన 62 మందిని ఆస్పత్రులకు తరలించామని, మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుపడి ఉండవచ్చని భయపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. కాంక్రీట్, ఉక్కు శిథిలాల కింద అనేక వాహనాలు సైతం నుజ్జు నుజ్జయ్యాయి. జనం, కార్లు, ఆటో రిక్షాలు, హాకర్లు కూలిపోయిన శిథిలాల కింద పడి ఉన్న దృశ్యాలు సిసి టీవీల్లో కనిపించాయి. సంఘటన స్థలంనుంచి పారిపోవడానికి ప్రయత్నించిన కొంతమంది కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ కాంక్రీట్ దిమ్మె కిందినుంచి రక్తమోడుతున్న ఓ చేయి సాయం కోసం అభ్యర్థిస్తున్న దృశ్యం అందరినీ కలచి వేసింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికి జనం వాటర్ బాటిళ్లు అందించడం కనిపించింది. కాగా, ప్రమాదంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం మొదలైంది. ప్రమాదానికి కారణం ఇంతకు ముందు అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంటేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2009లో ఇంతకు ముందు అధికారంలో ఉండిన లెఫ్ట్‌ఫ్రంట్ టెండర్‌ను ఆమోదించిందని, హైదరాబాద్‌కు చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఐవిఆర్‌సిఎల్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించిందని ఆమె చెప్తూ, ఎన్ని సార్లు రిమైండర్లు ఇచ్చినా కంపెనీ నిర్మాణానికి సంబందించిన వివరాలు అందజేయలేదని ఆరోపించారు. అయితే వామపక్షాలు ముఖ్యమంత్రి ఆరోపణలను తిప్పి కొడుతూ, ప్రభుత్వ ఉదాసీనతే ప్రమాదానికి కారణమని ఆరోపించాయి.
కాగా, మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షలు, స్వల్ప గాయాలయిన వారికి లక్ష రూపాయల పరిహారాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీ ప్రకటిస్తూ, ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించి చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిలో చాలామంది రక్తపు మడుగుల్లో పడి ఉండడాన్ని సంఘటన స్థలంలో ఉండిన పిటిఐ ప్రతినిధి చూశాడు. చాలా మంది వాహనాలు, భారీ కాంక్రీట్, స్టీల్ దిమ్మెల కింద చిక్కుపడి ఉండడం కనిపించింది. కాగా, సుమారు 300మంది ఆర్మీ జవాన్లులతో పాటుగా ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు.
బాధ్యులయిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ అధికారులపైన, ఇతరులపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని నగరానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన రాష్ట్ర గవర్నర్ కెఎన్ త్రిపాఠీ ప్రమాదంపై నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

చిత్రం కోల్‌కతాలో కూలిన ఫ్లైఓవర్ శకలాల వద్ద గుమిగూడిన జనం