జాతీయ వార్తలు

ఎవరూ జీవించిలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: అరుణాచల్ ప్రదేశ్‌లో ఏఎన్-32 విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్న భారత వైమానిక దళ బృందం ప్రమాదంలో ఎవరూ బతికిలేరన్న నిర్ధారణకు వచ్చింది. దట్టమైన అటవీ పర్వత ప్రాంతంలో ప్రమాదం స్థలికి బృందం గురువారం చేరుకుంది. విమానంలోని మొత్తం 13 మందిలో ఏ ఒక్కరూ సజీవంగా ఉంటారన్న ఆశలులేవని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. ‘జూన్ 3న జరిగిన ఏఎన్-32 విమాన ప్రమాదం మృతులకు నివాళి అర్పిస్తున్నాం. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అమరులైన ఐఏఎఫ్ సిబ్బంది ఆత్మకు శాంతికలగాలి’అని భారత వైమానిక దళ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఆయన వెల్లడించారు. వింగ్ కమాండర్ జీఎం చార్లెస్, స్క్వాడ్రన్ లీడర్ హెచ్ వినోద్, ఫ్లైట్ లెఫ్టినెంట్స్ ఎల్ ఆర్ థాపా, ఎంకే గర్గ్, అశిష్ అన్వర్, సుమిత్ మహంతి, వారెంట్ ఆఫీసర్ కేకే మిశ్రా, సార్జెంట్ అనూప్‌కుమార్, కార్పోరల్ షెర్ని, ఎల్‌ఏసీ(లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మెన్) ఎస్‌కే సింగ్, ఎల్‌ఏసీ పంకజ్, రాకేష్ కుమార్, పుతాలీ దుర్మరణం పాలయ్యారు. రష్యా ఆరిజన్ కంపెనీకి చెందిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం అస్సాంలోని జోర్హాట్ నుంచి మెంఛుకా వస్తూ చైనా సరిహద్దులో ఈనెల 3న కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన అరగంట తరువాత ఏటీసీతో విమానం సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ కోసం ఎనిమిది రోజులుగా తీవ్రంగా గాలింపుచర్యలు సాగాయి. సరిహద్దు జిల్లా సియాంగ్, షీ- యోమీ జిల్లా మధ్య గట్టే గ్రామంలో 12,000 అడుగుల లోతుగా విమానం కూలిపోయినట్టు బృందాలు గమనించాయి. ఎట్టకేలకు సహాయక బృందం ప్రమాద స్థలికి చేరుకుంది. 15 మంది సభ్యులతో కూడిన బృందం బుధవారం అక్కడి వెళ్లింది. అందులో ఎనిమిది మంది గురువారం ఉదయం ప్రమాద స్థలికి చేరుకుంది. 13 మందిలో ఎవరూ బతలేకదని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఈమేరకు సమాచారం అందించినట్టు ఐఏఎఫ్ ప్రతినిధి తెలిపారు.
ట్విట్టర్‌లో సంతాపాల వెల్లువ
ఏఎన్-32 విమాన ప్రమాదంలో ఎవరూ బతికిలేరన్న అధికారిక ప్రకటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. విషాద వార్త వెలువడిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో సంతాపాలు వెల్లువెత్తాయి. ‘మృతుల ఆత్మకు శాంతి కలగాలి’అంటూ ట్వీట్లు చేశారు. ప్రమాద వార్తను ఐఏఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించడంతో షాక్‌కు గురయ్యారు. 13 మంది యుద్ధ వీరుల సేవలు దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటించింది. బాధిత కుటుంబాలకు యూత్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.