జాతీయ వార్తలు

రాహుల్‌కు అభినందనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 49వ జన్మదినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, నేతలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు అభినందనలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని వారు అభిలషించారు. ‘శ్రీ రాహుల్..మీకు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, దీర్ఘాయుషుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ ‘మీ అభినందనలకు కృతజ్ఞతలు’ అని రీ ట్వీట్ చేశారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతల మధ్య భీకర వాగ్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్ని సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు కొంతకాలం నిశ్శబ్ద వాతావరణం ఏర్పడినప్పటికీ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా నేతలు, కార్యకర్తల్లో మళ్లీ పూర్వ ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం ఉదయం తన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన రాహుల్ సుమారు 10 గంటల సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ సంబరాలు జరుపుకుంటున్న నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వీట్లు పంచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తదితరులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక తన సోదరుడిని ఆలింగనం చేసుకుని స్వీట్లు తినిపించింది. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ అభినందనల వెల్లువ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని వ్యాఖ్యానించారు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అందరి ప్రేమ, అభిమానాలను పొందినందుకు గర్వపడుతున్నానని రాహుల్ అన్నారు. అనంతరం వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులతో రాహుల్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘ఒకే దేశం...ఒకే ఎన్నిక’ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రాహుల్ ట్వీట్ చేశారు. ఇలావుంటే, రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపినవారిలో డీఎంకే అధినేత స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి రాహుల్ గాంధీ స్వయంగా స్వీట్లను తీసుకురావడం అందర్నీ ఆకట్టుకుంది. తనను అభినందించిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ కార్యకర్తలు, నేతలతో కరచాలనం చేస్తూ రాహుల్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

చిత్రం...రాహుల్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్