జాతీయ వార్తలు

జన హితానికే జమిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘ఒక దేశం.. ఒక ఎన్నిక’ (జమిలి) ప్రతిపాదనను 24 పార్టీల అధ్యక్షులు ఆమోదించారు. ఒక దేశం, ఒక ఎన్నిక లక్ష్యాన్ని సాధించేందుకు అనుసరించవలసిన మార్గదర్శకాలను నిర్దేశించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలు కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. ప్రధాన మంత్రి ఏర్పాటు చేసే కమిటీ అన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రముఖులతో చర్చించిన అనంతరం ఒక నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేస్తుంది. అనంతరం తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరులకు చెప్పారు. ఒక దేశం ఒక ఎన్నిక అనేది ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిపాదన కాదు.. దేశ ప్రజల ప్రతిపాదన అని.. జన హితమే ధ్యేయంగా ‘జమిలి’ ఎన్నికలను ప్రతిపాదిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఒక దేశం ఒక ఎన్నిక, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం, 75వ స్వాతంత్య్ర దినోత్సవం, పార్లమెంటు సమావేశాల ఉత్పాదన పెంచటం, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవ భారత నిర్మాణానికి తీసుకోవలసిన చర్యలు, వెనుబడిన జిల్లాల అభివృద్ధి గురించి చర్చించేందుకు నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక దేశం ఒక ఎన్నికపై చర్చించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలన్నది నరేంద్ర మోదీ ఆలోచన. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే ఈ విషయంలో ముందడుగు ఉంటుందని ప్రధాని చెప్పినట్లు రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఏ అంశంపైనైనా భేదాభిప్రాయాలు వ్యక్తమైతే వాటిపై కూడా చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, బీజేడీ అధినాయకుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, అకాలీదళ్ అధినాయకుడు సఖ్బీర్ బాదల్, అప్నాదళ్ నాయకుడు అశీశ్ పటేల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ హాజరయ్యారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఆమ్ ఆద్మీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, జేడీఎస్, టీఎంసీ తదితర పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు.
సమావేశానికి మొత్తం నలభై పార్టీల అధ్యక్షులను ఆహ్వానించగా ఇరవై ఒక్క పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరో మూడు పార్టీల అధ్యక్షులు ఒక దేశం, ఒక ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లేఖలు పంపించాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఒక దేశం ఒక ఎన్నిక ప్రతిపాదనను అఖిలపక్ష సమావేశానికి హాజరైన పార్టీల అధినాయకులందరూ ఆమోదించారు. అయితే సీపీఎం, సీపీఐ మద్దతు పలికినా ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తారని వామపక్షాల నాయకులు ప్రశ్నించారు. మొత్తం మీద ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ప్రతిపాదనకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారని.. ఈ కమిటీని నరేంద్ర మోదీ ఏర్పాటు చేస్తారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ కమిటీ ఒక నిర్దారిత సమయంలోగా నివేదికను అందజేయవలసి ఉంటుంది. ప్రధాన మంత్రి ఏర్పాటు చేసే కమిటీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రముఖులు, మేధావులు, ఇతరులతో లోతుగా చర్చించి ఒక నివేదికను అందజేస్తారని అన్నారు. నివేదిక అందిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే మరోసారి అందరితో చర్చలు జరుపవచ్చునని ఆయన తెలిపారు.
పదిహేడవ లోక్‌సభలో సగానికి పైగా సభ్యులు కొత్తవారు కాబట్టి వారు సభా కార్యక్రమాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైందని అన్నారు. మహాత్మా గాంధీ ఆలోచనా విధానాన్ని యువతరానికి చెప్పవలసిన అవసరం ఉన్నదని అన్ని పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారని రక్షణ శాఖ మంత్రి చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకాన్ని అందరూ సమర్థించారు.. ఇది ఎంతో మంచి పథకమంటూ ప్రశంసలు కురిపించారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. జల నిర్వహణ సవాల్‌ను ఆమోదించినట్లు ప్రధాని ప్రకటించారని ఆయన చెప్పారు.

చిత్రం...ఢిల్లీలో బుధవారం నిర్వహించిన అఖిల సమావేశం దృశ్యం