జాతీయ వార్తలు

సమభావంతో పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ నాయకుడు ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ సూచించగా తమకు సముచిత సమయం కేటాయించాలి.. మీరు రిఫరీగా వ్యవహరించాలి తప్ప ఆటలో భాగస్వామి కాకూడదు అని చిన్న పార్టీల నాయకులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తనను స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఓం బిర్లా.. అందరి పట్ల సమభావంతో వ్యవహరిస్తానని.. ఎవరి పట్ల ఎలాంటి పక్షపాతం ఉండదని చిరునవ్వుతో హామీ ఇచ్చారు. సభను సజావుగా కొనసాగించేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మొదట లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలపరిచారు. వీరితోపాటు ఎన్‌డీఏ మిత్రపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు, వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్‌ఎస్, తెలుగుదేశం తదితర ప్రాంతీయ పార్టీలు ఓం బిర్లా పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదించగా పలువురు ఇతర నాయకులు బలపరిచారు. అయితే ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. లోక్‌సభలోని అధికార, ప్రతిపక్షాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. కొత్త స్పీకర్ తన పదవిని అలంకరించాలని వీరేంద్ర కుమార్ సూచించగానే నరేంద్ర మోదీ స్వయంగా ఓం బిర్లా వద్దకు వెళ్లి ఆయనను సాదరంగా స్పీకర్ ఆసనం వరకు తీసుకువచ్చారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌధరి, ఇతర పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా వారివెంట నడిచారు. ఓం బిర్లా తన సీట్లో కూర్చోగానే మోదీ, ఇతర మంత్రులు, ప్రతిపక్షం నాయకులు అభినందించారు. నరేంద్ర మోదీ లోక్‌సభకు రెండోసారి ఎన్నికైన కొత్త స్పీకర్ ఓం బిర్లాను ప్రశంసలతో ముంచెత్తారు. సభను సజావుగా నడిపించేందుకు తమ నుంచి పూర్తి సహాయ, సహకారాలుంటాయని ఆయన కొత్త స్పీకర్‌కు హామీ ఇచ్చారు. అధికార పక్షానికి చెందినవారెవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షానికి సముచిత సమయం కేటాయించాలని కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌధరి విజ్ఞప్తి చేశారు. కొత్త స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. మొదటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నెహ్రు చెప్పినట్లు దేశానికి, స్వాతంత్య్రానికి ప్రతీకలాంటిదైన లోక్‌సభకు మీరు సంరక్షకులని అధీర్ రంజన్ చౌధరి అన్నారు. లోక్‌సభ అధికార పక్షం, ప్రతిపక్షంగా విడిపోకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ నరేంద్ర మోదీ చెప్పిన మాటలను అధీర్ రంజన్ చౌధరి ఉటంకిస్తూ లోక్‌సభలో బహుపక్షలుంటాయి కాబట్టి స్పీకర్ నిష్పక్షపాతంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎక్కువ బిల్లులను స్టాండింగ్ కమిటీకి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం లోక్‌సభను దాటవేసేందుకు ఆర్డినెన్సులు జారీ చేస్తోందని అధీర్ రంజన్ చౌధరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం సభ్యుడు రామమోహన్ నాయుడు మాట్లాడుతూ స్పీకర్‌కు తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పక్షం నాయకుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ కొత్త స్పీకర్‌కు తమ పార్టీ నుంచి పూర్తి సహాయ, సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. తెలుగుదేశం సభ్యుల సంఖ్య తగ్గినందున కేటాయించే సమయాన్ని తగ్గించకూడదని రామమోహన్ నాయుడు స్పీకర్‌ను కోరారు. దేశాభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలను తమ పార్టీ బలపరుస్తుందని రామమోహన్ నాయుడు ప్రకటించారు. ఇత్తెహాదుల ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) పార్టీ అధినాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కొత్త స్పీకర్ రిఫరీగా వ్యవహరించాలి తప్ప ఆటలో భాగస్వామి కాకూడదని స్పష్టం చేశారు. మీరు మితవాద పార్టీకి చెందినా.. వామపక్షాలకు కూడా సముచిత సమయం కేటాయించాలని ఆయన కొత్త స్పీకర్‌కు సూచించారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించి బలపరిచిన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోసాటు పలువురు మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులకు ఓం బిర్లా ధన్యవాదాలు తెలిపారు. వీలున్నంత వరకు ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చిన్న పార్టీల నాయకులకు హామీ ఇచ్చారు. తాను పక్షపాతంతో వ్యవహరించే ప్రసక్తే లేదు.. అందరి పట్ల సమభావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.
చిత్రాలు.. ..లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా తోడ్కొని వెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. *స్పీకర్ స్థానంలో ఆశీనులైన ఓం బిర్లా