జాతీయ వార్తలు

బాబుకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమయ్యింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో బీజేపీలో టీడీపీపీ విలీనం కావటం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరితోపాటు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఉప రాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడును కలిసి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సంబంధించిన తీర్మానం లేఖను అందజేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, రాజ్యసభ నాయకుడు తావర్‌చంద్ గెహ్లోట్ ఆ వెంటనే వెంకయ్య నాయుడుకు మరో లేఖ అందజేస్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనను ఆమోదించినట్లు తెలియజేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉండటం గమనార్హం. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో కలిసిపోవటంతో లోక్‌సభలోని ముగ్గురు టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, కింజారపు రామమోహన్ నాయుడు, నాని కూడా బీజేపీ సభ్యులుగా మారిపోయినట్లేనని అంటున్నారు.
విలీన తీర్మానం ఆమోదం
టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తూ ఆమోదించిన తీర్మానం: ‘‘తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేష్ అధ్యక్షతన గురువారం సమావేశమై విలీన తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ పటిష్టమైన నాయకత్వం, అభివృద్ధి పథకాల మూలంగా ప్రేరణ, దేశం అభివృద్ధి చెందాలన్న తమ తపన మూలంగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చాం.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తక్షణమే బీజేపీలో విలీనం చేయాలని తీర్మానించాం. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోని నాల్గవ పేరా ఆధారంగా టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తున్నాం.. ఈ అంశాన్ని ఒక తీర్మానం ద్వారా రాజ్యసభ చైర్మన్‌కు తెలియజేయాలని కోరుతూ బీజేపీ అధ్యక్షుడికి లేఖ రాయాలని తీర్మానించాం.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోని నాల్గవ పేరా ప్రకారం టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడాన్ని ఆమోదించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఒక లేఖ రాయాలి’’. సంతకాలు చేసినవారు: సుజనా చౌదరి, రమేష్, గరికపాటి మోహన్ రావు, వెంకటేశ్. అయితే నాలుగో సభ్యుడు గరికపాటి మోహన్‌రావు గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో జారి పడటం వలన చికిత్సకోసం రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరినందున వెంకయ్య నాయుడు నివాసానికి రాలేకపోయారు. అయితే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తూ ఆమోదించిన తీర్మానంపై ఆయన కూడా సంతకం చేశారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్, కింజారపు రామమోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చలు జరిపారు. అయితే స్పీకర్‌తో జరిపిన చర్చల వివరాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో ముగ్గురు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, రమేష్, వెంకటేశ్‌కు పుష్పగుచ్చం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. నడ్డా మొదట ముగ్గురు రాజ్యసభ సభ్యులకు కండువాలు కప్పి బీజేపీలో చేర్చుకున్నారు. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు చాలాకాలం నుండి బీజేపీలో చేరాలనుకుంటున్నారని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పటిష్టమైన నాయకత్వం, దేశాభివృద్ధి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వం పట్ల వీరు ఆకర్షితులయ్యారని ఆయన తెలిపారు. నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాను పార్లమెంటు ఆవరణలో కలిసి టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఆమోదించటంతో టీడీపీపీ సమావేశమై విలీనం తీర్మానాన్ని ఆమోదించిందని నడ్డా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుందని నడ్డా హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు బీజేపీలో చేరటమే ఉత్తమమైన మార్గమని భావించి టీడీపీపీని బీజేపీలో విలీనం చేశామని సుజనా చౌదరి తెలిపారు. తాను గతంలో మూడున్నర సంవత్సరాలపాటు మోదీ ప్రభుత్వంలో పని చేశాను.. దేశాభివృద్ధి పట్ల వారికున్న చిత్తశుద్ధి తమకు బాగా నచ్చిందని చౌదరి వివరించారు. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు బీజేపీలో చేరడమే ఉత్తమమైన మార్గమన్నది తమ భావన అని ఆయన ప్రకటించారు. దేశమంతా మోదీ వైపు చూస్తోందని సుజనా చౌదరి తెలిపారు. దేశ ప్రజలందరు మోదీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి తాము కూడా మోదీని, బీజేపీని కోరుకున్నామని వెంకటేష్ చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి తమ నిర్ణయం తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిత్రాలు.. .తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చేసిన తీర్మాన ప్రతిని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేస్తున్న టీడీపీ ఎంపీలు * (ఫైల్‌ఫొటో ) నారా చంద్రబాబు నాయుడు