జాతీయ వార్తలు

కర్నాటకలో ‘కావేరి’ మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండ్య, సెప్టెంబర్ 6: తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్నాటకలో రైతులు భగ్గుమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా మంగళవారం రైతులు, ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి బెంగుళూరు, మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కావేరి రాజకీయాలకు కేంద్ర బిందువైన మండ్య జిల్లాలో ఆందోళనకారులు బంద్‌కు పిలుపునివ్వడమే కాకుండా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరపడంతో పాటుగా రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో శాంతిభద్రతలను కాపాడడానికి కావేరి పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు, కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. కృష్ణరాజసాగర్ డ్యామ్ చుట్టుపక్కల నిషేధాజ్ఞలను విధించడంతో పాటుగా ఈ నెల 9 దాకా డ్యామ్ పరిసరాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. తమిళనాడులోని రైతుల ఇబ్బందులను తీర్చడం కోసం పది రోజుల పాటు రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు మండ్య జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించి బలవంతంగా కార్యాలయాలను మూసివేయించారని, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు సైతం పలచగా ఉందని పొలీసులు చెప్పారు. సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై వెంటనే స్పందించిన కావేరి రైతు హితరక్షణ సమితి మండ్య బంద్‌కు పిలుపునిచ్చింది. దుకాణాలు, హోటళ్లు ఇతర వాణిజ్య సంస్థలు మూతపడగా, పాఠశాలలు, కాలేజిలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు బస్సులు కూడా తిరగలేదు. మైసూరు. హాసన్ జిల్లాల్లో కూడా ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు పలు చోట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీనియర్ మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులతో సమావేశమైనారు. తదుపరి కార్యాచరణపై చర్చించడం కోసం ఆయన సాయంత్రం అసెంబ్లీలో అన్ని పార్టీల నాయకులు, ఎంపీలతో కూడా సమావేశమవుతున్నారు. మరోవైపు, ఆందోళనకు దిగవద్దని, శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పుపై కౌంటర్ దాఖలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు కావేరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండ్య జిల్లా ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కావేరి హిత రక్షణ సమితి అధ్యక్షుడు జి మాదేగౌడ పిలుపునిచ్చారు.
ఆ నీరు సరిపోదు: డిఎంకె
చెన్నై:ఇదిలా ఉండగా, తమిళనాడులోని కావేరి డెల్టాలోని 40 వేల ఎకరాల్లోని పంటలను కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విడుదల చేసే నీరు సరిపోదని తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె అభిప్రాయ పడుతూ, దీనిపై తన తదుపరి కార్యాచరణ ఏమిటో తెలియజేయాలని జయలలిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ‘పది రోజుల పాటు రోజుకు 15 వేల క్యూసెక్కుల నీరు కావేరి డెల్టాలోని సాంబా(ఖరీఫ్) పంటలను కాపాడుకోవడానికి ఏమాత్రం సరిపోదు’ అని డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. సుపీంకోర్టు తీర్పు ప్రకారం కేవలం 13 టిఎంసిల నీరు మాత్రమే లభిస్తుందని, అయితే డెల్టాలోని మొత్తం 25 లక్షల ఎకరాలలు సాగు చేయాలంటే 200 టిఎంసిలు కావలసి ఉంటుందని ఆయన అన్నారు. ‘13 టిఎంసిల నీరు ఏమాత్రం సరిపోదని అందరికీ తెలుసు. దీనిపై ప్రభుత్వం ఏం చేయాలనుకుంటూ ఉందో చెప్పాలి. రైతులు కోరుతున్నట్లుగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారా? లేక కనీసం 50 టిఎంసిలు విడుదల చేసేలా ఆదేశాలు సాధిస్తారా? లేక ఈ విషయంపై మరింత ఒత్తిడి తేవడానికి ప్రధానమంత్రి వద్దకు అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్తారా?’ అని కరుణానిధి ప్రశ్నించారు.

చిత్రం.. మైసూర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు