జాతీయ వార్తలు

నెహ్రూ గడిపిన.. జైలుగది నేలమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైటు (పంజాబ్), జూలై 18: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా జైటు పట్టణంలోని ఒక జైలు గది ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కూలిపోయింది. ఒక సీనియర్ పోలీసు అధికారి గురువారం ఈ విషయం వెల్లడించారు. స్వాతంత్రోద్యమ కాలంలో 1923లో జవహర్‌లాల్ నెహ్రూ, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే సెల్‌లో ఒకరోజు ఉన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో రాచరిక పాలనలో ఉన్న నాభా రాష్ట్రంలో ఈ పట్టణం ఉండిం ది. ఈ పట్టణంలోకి ప్రవేశించడానికి కాంగ్రెస్ నాయకులపై నిషేధం విధించారు. అయితే నెహ్రూ, మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, ఈ పట్టణంలోకి ప్రవేశించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఒక రోజు పాటు ఇదే సెల్‌లో ఉంచారు. 240 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ చరిత్రాత్మక జైలు గది ఒక గోడ, పైకప్పు కూలిపోయింది. నెహ్రూ, కె.సంతానం, ఏటీ గిద్వాని 1923 సెప్టెంబర్ 22వ తేదీన ఈ జైలు గదిలోనే ఉన్నారు. భారీ వర్షాల కారణంగా బుధవారం ఈ జైలు గది కూలిపోయిందని ఫరీద్‌కోట్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజ్‌బచన్ సింగ్ సంధు తెలిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అకాలీలు నిర్వహించిన ‘జైటు కా మోర్చా’లో పాల్గొనేందుకు నెహ్రూ, మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులతో కలిసి జైటు పట్టణానికి చేరుకున్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ జైలు గది శిథిలావస్థకు చేరుకున్నదని, దీని నిర్వహణకు ఏమీ చేయలేదని ఎస్‌ఎస్‌పీ తెలిపారు. 1923లో జరిగిన కాంగ్రెస్ సెషన్‌లో మోర్చాకు మద్దతు పలుకుతూ తీర్మానం చేయడం వల్ల నెహ్రూ దానిలో పాల్గొనేందుకు జైటు పట్టణానికి వచ్చారు. రాజకీయ పరిణామాల గురించి తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ ముగ్గురిని పంపించింది. పోలీసులు వారిని అరెస్టు చేసి, 1923 సెప్టెంబర్ 22న ఈ జైలు గదిలో ఉంచింది. మరుసటి రోజు వారిని నాభా జైలుకు తరలించారు. కోర్టు అక్టోబర్ 3న ఆ ముగ్గురికి రెండేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 2008లో తన పంజాబ్ పర్యటనలో సెప్టెంబర్ 23న దేశ తొలి ప్రధాని గడిపిన చరిత్రాత్మక జైలు గదిని సందర్శించారు. ఈ జైలు గది జైటు పోలీసు స్టేషన్‌కు పక్కన ఉంది. ఇదిలా ఉండగా, అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ జైలు గది నిర్వహణ కోసం రూ. 65 లక్షలు మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్ గోయల్ తెలిపారు. ‘రాష్ట్ర పర్యాటక శాఖ తన అధీనంలోకి తీసుకొని, గత పదేళ్లుగా నిర్వహిస్తోంది. కాని, దానిని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు.