జాతీయ వార్తలు

నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అక్రమ నిర్బంధంపై ఆమె సోదరుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీ సర్కార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. యూపీలో నియంతృత్వ పాలన సాగుతోందని శనివారం ఇక్కడ మండిపడ్డారు. వారణాసిలోని ఛౌనర్ అతిధిగృహనంలో ప్రియాంకను బందీ చేసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆయన విమర్శించారు. సోంభద్రాలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను ఛౌనర్ గెస్ట్‌హౌస్‌కు తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘ప్రియాంకను బలవంతగా వెనక్కు తీసుకొచ్చి నిర్బంధంలో ఉంచారు. బీజేపీ ప్రభుత్వ చర్య అత్యంత దుర్మార్గం. విద్యుత్, మంచినీటి సదుపాయం లేని గెస్ట్‌హౌస్‌లో రాత్రంగా ఆమెను బందీగా ఉంచారు. యోగి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు’అని కాంగ్రెస్ మాజీ చీఫ్ తెలిపారు. యూపీ ప్రభుత్వ చర్యను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇలాంటి కుయుక్తులు, కుట్రలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆయన హెచ్చరించారు. దళితులు, గిరిజనుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ‘అరెస్టు’పై కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. ఉత్తరప్రదేశ్‌లో ఆటవిక పాలన కొనసాగుతోందని పార్టీ ఆరోపించింది. సోంభద్రలో గిరిజనులపై మారణకాండను నిరోధించడం, నిందితులపై చర్యలు తీసుకోవడంలోనూ బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాహుల్ నిప్పులు చెరిగారు. అన్యాయానికి గురైన వారిని పరామర్శించడానికి వెళ్తుంటే ప్రభుత్వం అణచివేత చర్యలు, అరెస్టులకు పాల్పడడం సిగ్గుచేటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ఛౌనర్ గెస్ట్‌హౌస్‌కు విద్యుత్, నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన విమర్శించారు. యూపీలో ఆటవిక పాలన సాగుతోందని సుర్జేవాలా ధ్వజమెత్తారు.
ఎంపీని తాకిన సోంభద్రా సెగ!
భోపాల్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ నిర్బంధం వ్యవహారం మధ్యప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. సోంభద్రాలో భూ వివాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ప్రియాంకను యూపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఎన్‌పీపీ ప్రజాపతి సభను ఐదునిమిషాల సేపువాయిదా వేశారు. ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే మంత్రి జితూ పట్వారి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ‘అరెస్టు’ అంశాన్ని లేవనెత్తారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే యూపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. మంత్రి పట్వారీకి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు ఒకరి తరువాత ఒకరు మాట్లాడడం మొదలెట్టారు. దీంతో సభ అదుపుతప్పింది. అదే సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ్యులూ మాట్లాడడం ప్రారంభించడంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఇరు పార్టీల సభ్యులను శాంతింపచేయడానికి స్పీకర్ ప్రజాపతి విఫలయత్నం చేశారు.
యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చిత్ర హింసలకు గురిచేసే 10 మంది గిరిజనులను పొట్టనబెట్టుకుందని మరో మంత్రి ఓంకార్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రియాంక నిర్బంధం ఓ రాష్ట్రానికి సంబంధించిందని, దానిపై దేశ వ్యాప్తంగా చర్చించాల్సిన అవసరం లేదని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే భూపేందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సజావుగా సాగనిద్దామని, జీరో అవర్‌లో దీనిపై చర్చించవచ్చన్న స్పీకర్ సూచనను సభ్యులు పట్టించుకోలేదు.