జాతీయ వార్తలు

నింగికెగిసిన ‘భారత్’యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 22: యావత్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. చంద్రుడి పైకి ‘షార్’ మరోసారి ఉపగ్రహాన్ని ప్రయోగించి భారత్ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయంగా శిఖరాగ్రాహాన్ని అధిరోహింప చేసింది. రోదసీ పరిశోధనలో భారత్ మరోసారి సత్తా చాటింది. వరుస ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా రోదసీ పరిశోధనలో సరికొత్త రికార్డు సృష్టించింది. స్వదేశీ క్రయోజనిక్‌లో మరోసారి మన శాస్తవ్రేత్తలు తిరుగులేని సత్తా చాటారు. అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని అధిగమించి ప్రపంచంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేదని నిరూపించుకొని 10 సంవత్సరాల తన కలల సాకారాన్ని మన శాస్తవ్రేత్తలు నిజం చేశారు. చంద్రుని మీద మూలాలను కొనుగొనడానికి భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-2ను జాబిలి పైకి విజయవంతంగా ప్రయోగించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కదనాశ్వం జీఎస్‌ఎల్‌వీ-మార్క్3-ఎం రాకెట్ మరోసారి విజయబావుటా ఎగురవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన చంద్రయాన్-2 ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను మార్క్-3 వాహక నౌక విజయవంతంగా కక్ష్యలోకి మోసుకెళ్లింది. దీంతో క్రయోజనిక్ ప్రయోగాల్లో ఇస్రో వరుసగా తొమ్మిదోసారి విజయం సాధించడమే కాకుండా మార్క్3 భారీ ప్రయోగాల్లో నాలుగో విజయం సాధించి శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత
అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 20 గంటలు నిరాటంకంగా కొనసాగింది. ఆ తరువాత సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2:43 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం1 వాహక నౌక ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో స్వదేశీ క్రయోజనిక్ సాయంతో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 రాకెట్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ వాహక నౌక ద్వారా చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ పరికరాలను వాహక నౌక 16:23 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిందని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి శాస్తవ్రేత్తలతో కలిసి రాకెట్‌ను తిలకిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అధికారికంగా ప్రకటించారు. కక్ష్యలోకి ప్రవేశించాక వాహక నౌక నుంచి చంద్రయాన్-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. రాకెట్ భూమి నుంచి ఎగిరినంతరం తన మూడు దశలను సునాయాసంగా పూర్తిచేసుకొని చివరి చంద్రయాన్-2ను భూమికి దగ్గరగా (ఫెరిజి) 169.7 కిమీ దూరం, భూమికి దూరంగా (అపోజి) 45,475 కిమీ దూరంగా చంద్రయాన్-2లో ఉన్న 3877 కిలోల బరువుగల ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ను నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా విడిచిపెట్టింది. అంటే ఇస్రో అనుకున్న దూరంలో కంటే 6 వేల కిమీ దూరంలో కక్ష్యలోకి మూడు మాడ్యూల్స్ చేరాయి. దీనివల్ల ఉపగ్రహ పనికాలం పెరుగుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహాన్ని చంద్రుని దక్షిణ ధ్రువంలో ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన పని కాగా, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నమిది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయాక 15 నిమిషాలు అత్యంత కీలకం. రోవర్ సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రునిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగో దేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు. చంద్రయాన్-1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్టమొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్-2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించి నాలుగో దేశంగా అవతరించింది. ఈ మూడింటిని ఒకేసారి పంపించడంతో దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. 2008 నుంచి పలుమార్లు చంద్రయాన్-2ను వాయిదా వేసుకొంటూ వచ్చి జూలై 15న ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. మళ్లీ వారం రోజులు తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సిద్ధమయ్యారు.
ఇక చంద్రుడి వద్దకు చేరే దిశగా..
రాకెట్ నుంచి విడిపోయిన చంద్రయాన్-2లో ఉన్న కాంపోజిట్ మాడ్యూల్ 14 రోజులపాటు రోదసీలో పయనింపచేసి చంద్రుడి సమీపంలోకి చేరవేస్తారు. ఇలా లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీ 5 రోజులపాటు చంద్రయాన్-2 పెలోడు సంచరిస్తూ ఉంటుంది. 22వ రోజు చంద్రుడి కక్ష్య వద్దకు చంద్రయాన్-2ను చేరవేస్తారు. 22వ రోజు నుంచి 45వ రోజు వరకు దీర్ఘవృత్తాకారంలో ఉండే ఈ కక్ష్యలో చంద్రయాన్-2 పరిభ్రమిస్తూ ఉంటుంది. అనంతరం శాస్తవ్రేత్తలు అడాప్టర్ నుంచి ఆర్బిటర్ వేరుపడేలా చేస్తారు. ఈ ఆర్బిటర్‌లోని అపోజి మోటారును మండించి చంద్రుడి 100 కిమీ ఎత్తులో వృత్తాకార కక్ష్యలో చేరుస్తారు. 48వ రోజు చంద్రుడి ధ్రువం పైకి ఆర్బిటర్ నుంచి ల్యాండర్‌ను దించుతారు. ల్యాండర్ దిగిన తరువాత అందులో రోవర్ వెలుపలికి వస్తుంది. ఇది 500 మీటర్ల దూరంలో పయనిస్తూ చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ల్యాండర్ చంద్రుడిపై దిగిన పదిహేను నిమిషాల్లోనే దానికి సంబంధించిన ఫోటోలు భూమికి అందుతాయి. అయితే ల్యాండర్ దిగిన నాలుగు గంటల తరువాత దానిలో ఉన్న రోవర్ బయటకు వస్తుంది. చంద్రయాన్-2 అత్యంత కీలకమైన ఘట్టం చంద్రుడి సమీపానికి వెళ్లాక ఆర్బిటర్ నంచి ల్యాండర్ విడివడి సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యే ఘట్టమే. ఇందుకు పట్టే సమయం 15 నిమిషాలు. కానీ ఇంతటి కీలకమైన ఆపరేషన్‌ను ఇస్రో మునుపెన్నడూ చేపట్టనందున ఆ పదిహేను నిమిషాలను భయంకరమైన క్షణాలు (టెర్రిఫయింగ్ మూమెంట్స్)గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ల్యాండర్ ఆ దక్షిణ ధ్రువం వద్దకు దిగే సమయంలో చాలా నెమ్మదిగా దిగాలి. ఎటువంటి కదలికలు ఉండకూడదు. అంటే మామూలు సమయంలో రాకెట్ సెకనుకు 10,3578 కిమీ వేగంతో పయనిస్తుంది. ల్యాండర్ దిగే సమయంలో సెకన్‌కు కేవలం 5 సెంటీమీటర్ల వేగంతో పయనించాలి. అంటే లక్ష రెట్లు వేగం తగ్గించి సెకనుకు అరకిలోమీటరు కన్నా తక్కువ దూరం పోతుంది. జాబిలి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయిన ఘనత ఇంతవరకు మరే మిషన్‌కూ లేదు. ఆ ఘనత చంద్రయాన్-2కే దక్కుతుంది. రోవర్ పనిచేయడానికి అవసరమైనంత సౌరశక్తి లభించేందుకు వీలుగా ధారాళంగా సూర్వకాంతి పడటం, ఆ ప్రాంతమంతా దాదాపు చదునుగా ఉండడం, సురక్షిత ల్యాండింగ్‌కు అవకాశం ఉండడం ఈ కారణాలన్నింటి రీత్యా ఇస్రో ఈ ప్రదేశాన్ని ఎంచుకొంది. ఈ ప్రయోగ మొత్తం ఖర్చు రూ.978 కోట్లు. ఇందులో ఉపగ్రహం రూ.603 కోట్లు కాగా వాహక నౌక ఖర్చు రూ.375 కోట్లు. ఇస్రో పదేళ్ల కలల సాకారం చంద్రయాన్-2 విజయంతో చంద్రమండలంలో కోట నిర్మించుకునే దిశగా అడుగులు వేయడంతో ప్రపంచ దేశాల చూపంతా భారత్ వైపే చూస్తున్నాయి.