జాతీయ వార్తలు

210కి చేరిన వరద మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య మంగళవారంనాటికి 210కి చేరుకుంది. ఒక్క కేరళలోనే అత్యధికంగా మృతుల సంఖ్య 88కి చేరుకుంది. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మెరుగుపడుతుండడంతో అధికారులు సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేశారు. గత వారం ఒడిశాలో భారీ వర్షాలు, వరదలు ప్రజలను వణికించిన విషయం తెలిసిందే. మంగళవారంనాడు సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో మళ్లీ వరద ముంపు తలెత్తే సూచనలు కనిపించాయి. కేరళలో 88 మంది, మహారాష్టల్రో 43 మంది, కర్నాటకలో 42 మంది, గుజరాత్‌లో 31 మంది వరదల వల్ల మరణించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు వార్తలు అందాయి. ఇదిలావుండగా, కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, అలప్పుజా వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మంగళవారంనాడు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హిందూ మహాసముద్రంలో గాలులు మరింత బలపడడంతో దాని ప్రభావం వల్ల కేరళలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తిరువనంతపురంలోని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ కే సంతోష్ మీడియాకు తెలిపారు. ఇదిలావుండగా, మహారాష్టల్రో వరద దెబ్బతిన్న కొల్హాపూర్, సాంగ్లి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన కనీస ఆహార పదార్థాలను అందజేయడంపై తాము దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. కర్నాటకలోని వివిధ రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతుండడంతో వాటి కిందనున్న ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు కాస్త వెసులుబాటు లభిస్తోందని ఆయన తెలిపారు. ‘వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో సైతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో గురువారంనాడు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సాధారణ రీతిలో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎడతెగని వర్షాల కారణంగా ఒడిశాలోని పశ్చిమ ప్రాంతంలోని బౌధ్, బోలాన్‌గిరి, కల్హండి, కందమాల్, సోనేపూర్ జిల్లాల్లో రైలు ట్రాక్‌ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానునున్న మూడు రోజుల్లో కూడా భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాం గం అందుకు తగిన చర్యల్లో నిమగ్నమైంది. దేశ రాజధానిలో సైతం మంగళవారం భారీ వర్షం పడింది. అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని సుజన్‌పుర్ తిరా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
వారి ధైర్యం, వినయం భేష్..
కోజికోడ్(కేరళ): కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలు ఇలాంటి విపత్కర సమయంలోనూ చూపిన ధైర్యం, గౌరవం నిజంగా అభినందించతగ్గవని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ నుంచి తిరిగి వస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను’ అని రాహుల్ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. వాయనాడ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతా ల్లో రెండు రోజులపాటు ఆయన కేరళలో పర్యటించారు. దెబ్బతిన్న ప్రాంతాలైన వాయనాడ్‌లోని పుతుమల, మల్లాప్పుర జిల్లాలోని నీలాంబుర్, కావలప్పర ప్రాంతాల్లో రాహుల్ గాంధీ మంగళవారం పర్యటించారు. జాతీయ విపత్తు వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆయన కోరారు.
చిత్రాలు.. వాయనాడ్‌లో వరద బాధితులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ
* షిమోగాలో వరద పీడిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప