జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ప్రగతి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్మూ-కాశ్మీర్ ఇక అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ జమ్మూ-కాశ్మీర్‌లో 370 అధికరణ రద్దుతో అభివృద్ధికి శ్రీకారం జరిగిందని అన్నారు. ఆ రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల సత్వర అభివృద్ధికి బీజం పడిందని ఆయన అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో, విదేశాల్లో నివసిస్తున్న భారతమాత ముద్దుబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. లెక్కనేనంతమంది చేసిన ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని ఆయన అన్నారు. స్వతంత్ర భారతంలో 72 సంవత్సరాలు పూర్తిచేసుకున్నామని, త్వరలోనే జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకోనున్నామని ఆయన అన్నారు. గాంధీ చూపిన మార్గంలో ముందుకెళ్తూ అభివృద్ధిని సాధిస్తున్నామని ఆయన అన్నారు. గాంధీ తరానికి, ఇప్పటికీ దేశంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని.. అయినప్పటికీ గాంధీ బోధనలు ఇప్పటి సమాజానికి కూడా వర్తించే విధంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లను గాంధీ ముందుగానే ఊహించారని.. వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో కూడా ఆయన సూచించారని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో స్థిరమైన అభివృద్ధిని సాధించడమే మన ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు. ఈ ఏడాది గురునానక్ 550వ జయంతిని జరుపుకోనుండడం మరో విశేషమని ఆయన అన్నారు. కేవలం సిక్కు మత వ్యవస్థాపకుడిగానే కాకుండా గొప్ప దార్శకునిగా కూడా గురునానక్‌ను పేర్కొనవచ్చునని రాష్టప్రతి అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరచిన 370 అధికరణను రద్దు చేయడం అక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలుచేకూర్చే చర్య అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
అన్నారు. ఇకపై వారికి కూడా భారత పౌరులతో సమానంగా హక్కులు, అధికారాలు, అవకాశాలు, సౌకర్యాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇది వారికి ఎంతో మేలు చేసే అంశమని అన్నారు. స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ అధికార బదలాయింపు మాత్రమే కాదని, ముందుచూపుతో జాతిని నిర్మించడం కూడా అని రాష్ట్రపతి అన్నారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు, కుటుంబం, సమాజం అభివృద్ధి చెందినపుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికలు దేశంలో ప్రజాస్వామిక విలువల ఔన్నత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని రాష్ట్ర పతి అన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పెరిగిన రద్దీ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకానికి, అభిమానికి అద్దం పడుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ప్రతి ఎన్నిక ఒక కొత్త భవిష్యత్తుకు శ్రీకారం చుడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయని కోవింద్ అన్నారు. లోతైన చర్చ, విశే్లషణల తర్వాత పలు కీలక బిల్లులను ఉభయసభలు ఆమోదించాయని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలు కొనసాగిన తీరు అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం, త్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలను పార్లమెంటు తీసుకుందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి, మరిన్ని సామాజిక మార్పులకు ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు కోవింద్ తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లతో పోలిస్తే ఇపుడు గుణాత్మక మార్పులు కళ్లముందు కనిపిస్తున్నాయని కోవింద్ అన్నారు. దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, శక్తివంచన లేకుండా కృషి చేయడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని, అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని అయన తెలిపారు. వౌలిక సదుపాయాల కల్పన నుంచి ద్రవ్య విధానం వరకు ఎన్నో అంశాల్లో అమలు చేస్తున్న ప్రణాళికలు సానుకూల ఫలితాలను ఇస్తున్నట్టు కోవింద్ పేర్కొన్నారు. వ్యక్తులు, సమాజం, స్థానిక సంస్థలు, రాష్ట్రాలు కలిసికట్టుగా సమైక్యతను కాపాడాలని, సమగ్రతకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. మరింత అభివృద్ధి తాను ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.
చిత్రం... స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్