జాతీయ వార్తలు

రవిదాస్ మందిర్‌ను పునర్నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: సెంట్రల్ ఢిల్లీలోని ఝన్‌దేవాలన్, రామ్‌లీలా మైదాన్ మధ్య గల ప్రాంతమంతా బుధవారం నీలి సముద్రాన్ని తలపించింది. దేశ రాజధానిలోని రవిదాస్ మందిర్ కూల్చివేతను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది దళితులు తరలిరావడంతో ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోయాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటి (డీడీఏ) ఈ నెల పదో తేదీన రవిదాస్ మందిర్‌ను కూల్చివేసింది. నీలి రంగు టోపీలు ధరించి, జెండాలు చేతపట్టుకొని భిన్న వయసులకు చెందిన వేలాది మంది దళితులు ఝన్‌దేవాలన్‌లోని అంబేద్కర్ భవన్ నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దళితుల ఆందోళన కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాలలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రదర్శకులు ‘జై భీమ్’ అంటూ పెద్ద పెట్టున నినదిస్తూ ముందుకు కదిలారు. ప్రభుత్వం ఆ స్థలాన్ని కమ్యూనిటీకి అప్పగించడంతో పాటు రవిదాస్ మందిర్‌ను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. తుఘ్లకాబాద్ అటవీ ప్రాంతంలోని అదే స్థలంలో లేదా మరో ప్రత్యామ్నాయ స్థలంలో రవిదాస్ మందిర్‌ను పునర్నిర్మించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండటంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. దేశ రాజధానిలో జరిగిన ఈ భారీ ప్రదర్శనలో ఢిల్లీ రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, దళిత వర్గానికి చెందిన ఆధ్యాత్మిక నాయకులు పాల్గొన్నారు. ప్రదర్శకులను ఉద్దేశించి గౌతమ్ మాట్లాడుతూ దళితులకు జరిగిన అన్యాయంపైనే తాము పోరాడుతున్నామని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కాదని అన్నారు. ‘నేను దళితుల ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఢిల్లీ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా కాదు. మేము సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. కాని, దేశవ్యాప్తంగా దళితుల ఆలయాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే ఎందుకు కూల్చివేతకు గురవుతున్నాయనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి’ అని ఆయన అన్నారు. రవిదాస్ మందిర్ ఉద్యమం కోసం పలు దళిత సంఘాలు కలిసి ‘అఖిల్ భారతీయ సంత్ శిరోమణి గురు రవిదాస్ మందిర్ సం యుక్త సంరక్షణ్ సమితి’గా ఏర్పడ్డాయి. ఈ సమితి నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనకు తరలివచ్చిన దళితులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని దృఢంగా ప్రకటించారు. కొంతమంది అయితే రామ్‌లీలా మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని అన్నారు.

చిత్రం... రవిదాస్ మందిర్ కూల్చివేతకు నిరసనగా ఢిల్లీలో బుధవారం భీమ్ ఆర్మీ నిర్వహించిన ర్యాలీ