జాతీయ వార్తలు

నిర్భీతిగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణ రద్దు చేయడం ద్వారా సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆశయాలను ప్రధాని మోదీ ప్రభుత్వం సాకారం చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశ సమగ్రత కోసం పోలీసులు ఎనలేని సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. శనివారం ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన శిక్షణ పూర్తిచేసుకున్న 70వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రొబేషనరీలుగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సమాజంలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. పోలీసులు అహర్నిశలు శాంతి భద్రతల సాధనకు కృషి చేస్తున్నారని హోం మంత్రి ప్రశంసించారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ దేశ సేవకు అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం 72 సంవత్సరాల తర్వాత నెరవేరిందని అమిత్ షా ప్రకటించారు. మోదీ ప్రభుత్వం సాహసంతో తీసుకున్న నిర్ణయం 370వ అధికరణ రద్దుకు దోహదపడిందని ఆయన తెలిపారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ సంస్థానం విమోచనకు పటేల్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందిగా అమిత్ షా అభివర్ణించారు. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఉన్నత విద్యావంతులు ఐపీఎస్ సర్వీసుల్లో చేరడాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. దేశానికి సేవ చేసేందుకు ఇది ఒక మహత్తర అవకాశంగా ఆయన చెప్పారు. రాగద్వేషాలకు అతీతంగా పోలీసు అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సివిల్ సర్వీసులకు అహోరాత్రులు కష్టపడి చదివి ఎంపికైనంత మాత్రాన సరిపోదని, అవినీతి నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు కృషి చేయాలని ఉద్ఘాటించారు. బాహ్య, అంతర్గత శత్రువుల నుంచి దేశానికి పొంచి ఉన్న ముప్పును సాహసంతో ఎదుర్కొనాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదురొడ్డి పోరాడాలని హోం మంత్రి పిలుపునిచ్చారు. కాగా రానున్న రోజుల్లో పోలీసు అధికారులు ఎన్నో సవాళ్లను చవి చూడాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 33 వేల మంది దేశ సమగ్రతకు బలిదానం చేశారన్నారు.‘ప్రజలతో మమేకం కావాలి. వారితో సత్సంబంధాలు పెట్టుకోవాలి. ప్రజల సహకారంతో సంఘ విద్రోహశక్తుల ఆటలను కట్టించాలి’అని ఆయన పిలుపునిచ్చారు. సమాజానికి హాని చేసే శక్తులను ఏరిపారేయాలన్నారు. ప్రజలతో అను నిత్యం సంబంధాలుంటే చాలా సమాచారం వస్తుందన్నారు. తాను రాజకీయంగా దిగువ స్థాయి నుంచి ఎలా ఉన్నత స్థాయికి వచ్చిన వైనాన్ని ఆయన ఉదహరిస్తూ ‘దేశానికి సేవ చేయాలంటే ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలి’అని చెప్పారు. రాజకీయనాయకులు ఐదేళ్లకోసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తారని, వారి పదవీ కాలం కేవలం ఐదేళ్లు మాత్రమేనని తెలిపారు. అదే సివిల్ సర్వీసుల్లో చేరిన అధికారులు మూడు దశాబ్థాలకు పైగా జాతికి సేవలు అందిస్తారని అమిత్‌షా పేర్కొన్నారు. విలువైన కాలాన్ని వృథా చేయవద్దు, విధి నిర్వహణలో నిర్భీతితో పనిచేయండి అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్మార్ట్ పోలీసు విధానాన్ని కోరుకుంటున్నారని హోం మంత్రి తెలిపారు. దేశ సంపదను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, నేషనల్ పోలీసు అకాడమి డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రాలు.. శివరాంపల్లిలోని జాతీయ పోలీసు అకాడమీలో యువ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా