జాతీయ వార్తలు

ఇక భారత్ చేతికి ‘రఫాలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్ ఫ్రాన్స్‌నుంచి 7.87 బిలియన్ల యూరోలు (సుమారు 59వేల కోట్లు) వెచ్చించి 36 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు శుక్రవారం ఇక్కడ సంతకాలు చేశాయి. ఈ యుద్ధ విమానాలకు ఆధునిక క్షిపణులు, ఆయుధ వ్యవస్థ బిగించి ఉంటుంది. దీంతో పాటు భారత్ అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టమైన మార్పులు కూడా ఈ విమానాలకు చేసి ఇస్తారు. దీనివల్ల బద్ధ విరోధి పాకిస్తాన్‌కన్నా భారత వాయుసేన సామర్థ్యం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ వెస్ లె డ్రియాన్ శుక్రవారం ఇక్కడ ఈ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా భారత్ ఆ దేశం నుంచి 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కాంట్రాక్టులపై కూడా ఇరు దేశాలు శుక్రవారం తొలుత సంతకాలు చేశాయి. ఎలాంటి అదనపు ప్రత్యేక సౌకర్యాలు లేని ఒక సీటు గల రఫాలే యుద్ధ విమానం ధర సుమారు 91 మిలియన్ యూరోలు ఉంటుంది. రెండు సీట్లు గల శిక్షణ యుద్ధ విమానం ధర సుమారు 94 మిలియన్ యూరోలు ఉంటుంది. ‘్భరత్ 36 రఫాలే యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఆయుధ వ్యవస్థ బిగించి ఉన్న ఈ యుద్ధ విమానాలకు అవసరమయ్యే విడి భాగాలను అయిదేళ్ల పాటు సరఫరా చేయడంతో పాటు అవసరమైన మరమ్మతులను కూడా ఫ్రాన్స్ చేస్తుంది. భారత్‌కు అవసరమైన నిర్దిష్టమైన ప్రత్యేక సదుపాయాలు వీటిలో ఉంటాయి. భారత వాయుసేన సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదో ముందడుగు’ అని పారికర్ ఇక్కడి సౌత్ బ్లాక్‌లో విలేఖరులకు చెప్పారు. గత 20 ఏళ్లలో యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. గత యుపిఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రద్దయిన ఆ ఒప్పందంతో పోల్చితే ఈ తాజా ఒప్పందం వల్ల భారత్ సుమారు 750 మిలియన్ యూరోలను పొదుపు చేసుకోగలిగింది. భారత్ గట్టిగా బేరమాడడం వల్లనే ఇది సాధ్యమయింది. ఒప్పందం కుదిరినప్పటి నుంచి 36 నెలలలోగా ఈ యుద్ధ విమానాల సరఫరా మొదలవుతుంది. 66 నెలలలోగా పూర్తవుతుంది. ఈ రఫాలే యుద్ధ విమానాలకు బిగించి ఉండే క్షిపణులు 150 కిలో మీటర్లకన్నా ఎక్కువ దూరంలో గగనతలంలో గల లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాయి. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 80 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులను కలిగిన యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ 50 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో కూడిన యుద్ధ విమానాలను ఉపయోగించింది. అప్పట్లో పాకిస్తాన్ వద్ద ఆ స్థాయి సామర్థ్యం గల క్షిపణులతో కూడిన యుద్ధ విమానాలు లేవు. అయితే పాకిస్తాన్ తరువాత కాలంలో 80 కిలో మీటర్ల దూరంలో గల గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో కూడిన యుద్ధ విమానాలను సేకరించుకుంది.

చిత్రం.. ఒప్పంద పత్రాలు ఇచ్చిపుచ్చుకుంటున్న భారత, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు పారికర్, జీన్ వెస్ లె డ్రియాన్