జాతీయ వార్తలు

రాహుల్‌పై చెప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్ తనపై ఎన్ని చెప్పులు వేయించినా భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. సోమవారం లక్నోకు దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్‌లో ఓపెన్ టాప్ వాహనంపై నిలబడి రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి రాహుల్ పైకి చెప్పు విసిరాడు. అయితే అది రాహుల్ గాంధీ పక్కన ఉన్న జతిన్ ప్రసాదపై పడింది. చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనను మొదట పెద్దగా పట్టించుకోని రాహుల్ గాంధీ, రోడ్ షో పూర్తయిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. వాళ్లు విద్వేషంతో పనిచేస్తే కాంగ్రెస్ ప్రేమను పంచుతుంది, ప్రేమతో పనిచేసే విధానానికే కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని రాహుల్ ప్రకటించారు. రాహుల్ గాంధీ కిసాన్ యాత్ర పేరుతో ఉత్తరప్రదేశ్‌లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దాదాపు నెల రోజులపాటు కొనసాగే ఈ రోడ్ షోలలో ఆయన కాంగ్రెస్ విధానాల గురించి వివరించటంతోపాటు కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే రాహుల్‌పైకి చెప్పు విసిరిన అనూప్ మిశ్రా మాత్రం ఆయన వాదనతో ఏకీభవించటం లేదు. జర్నలిస్టుగా పని చేస్తున్న తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కాంగ్రెస్ దేశాన్ని నిలువునా ముంచుతోంది కాబట్టే రాహుల్‌పైకి చెప్పు విసిరానని ఆయన వాదిస్తున్నారు. గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని నిలువునా ముంచింది, ఎలా మోసం చేస్తోందనేది జర్నలిస్టుగా తనకు బాగా తెలుసునని అనూప్ మిశ్రా అంటున్నారు. అయితే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రోద్బలంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీపైకి ఎన్ని చెప్పులు విసిరినా భయపడేది లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

చిత్రాలు..రాహుల్ గాంధీపై చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీతాపూర్‌లో సోమవారం కాంగ్రెస్ నిర్వహించిన కిసాన్ యాత్రలో ఒక బాలుడితో కరచాలనం చేసేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీ