జాతీయ వార్తలు

ఈసారి బీజేపీకి ఎదురీతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి విజయం అంత సునాయాసంగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఓటు షేరును పెంచుకుని అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి అనేక కోణాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది.
రెండోసారి కూడా అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈసారి తమకు 75 సీట్లకు పైనే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చీలిపోయాయని, 90 సీట్ల అసెంబ్లీలో 75 సీట్లు తమకు ఖాయమన్న ఆయన నమ్మకం ఎంతమేరకు ఆచరణాత్మకం అవుతుందన్నది సందేహమే. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగబోతోంది. ఇతర చిన్న పార్టీల పాత్ర నామమాత్రంగానే కనిపిస్తోంది. పోటీలో ఉన్న ఇతర పార్టీలు ఐఎన్‌ఎల్‌డీ కొంత కీలకంగా కనిపిస్తోంది. అయితే, వివిధ పార్టీల చీలిక కూటమిగా ఏర్పడ్డ జననాయక్ జనతా పార్టీ ఏమేరకు రాజకీయంగా పోటీనిస్తుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగం, రైతుల సమస్యలు, నీటి సమస్యలు, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో వైఫల్యం వంటివి ప్రతిపక్ష పార్టీలకు అధికార బీజేపీని ఎండగట్టేందుకు బలమైన ఆయుధాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఇవేవీ కూడా తమ విజయాన్ని అడ్డుకోలేవని చెబుతున్న బీజేపీ నాయకత్వం అవినీతి నిర్మూలన, ఎన్‌ఆర్‌సీ అమలుతోపాటు కాశ్మీర్‌లో 370 అధికరణ రద్దు మొదలైన అంశాలను కూడా సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహాలో ఓట్ల ఉప్పెనను సృష్టించగలనన్న ధీమాతో ఉంది. హర్యానాలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అంతర్ కలహాలతో సతమతం కావడం కూడా అధికార బీజేపీకి కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దేవీలాల్ స్థాపించిన ఐఎల్‌ఎల్‌డీ గత ఏడాదిన్నరగా చీలికలు, పీలికలుగా మారింది. ముఖ్యంగా చౌతాలా కుటుంబంలో తలెత్తిన వివాదాలు ఐఎన్‌ఎల్‌డీని రాజకీయంగా బలహీనపరిచాయి. ఈ పార్టీకి చెందిన నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే మొదటినుంచి కూడా గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూనే ఉంది. అయితే, పార్టీ అధినాయకత్వం ఇటీవల చేసిన మార్పులు కొంతమేర ఉపశమనాన్ని కలిగించినప్పటికీ అది ఎంతమేరకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసివస్తుందన్నది చెప్పలేని పరిస్థితే. గతాన్ని మరచిపోయి తామంతా ఐక్యంగా పనిచేసి, బీజేపీని ఎదుర్కొంటామని పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కుమారి షెల్జాను రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా నియమించడంతోపాటు మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అధినాయకత్వం నియమించింది. ఇవన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని కలిగించినా అవి ఓట్ల రూపంలో ఎంతమేరకు ఫలిస్తాయో అన్నది వేచిచూడాల్సిందే. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జేజేపీ స్వతంత్రంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
*చిత్రాలు.. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్
*కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా