జాతీయ వార్తలు

బీజేపీలో ‘మహా’ సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: వచ్చే నెలలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేయడంతోపాటు మరింతగా తన బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఫడ్నవిస్ నాయకత్వానికి ఈ ఎన్నికలు మరో పరీక్షగానే భావిస్తున్నారు. అధికార పార్టీ ఆశలు మరింతగా ఇనుమడిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీ మాత్రం ఏవిధంగా బలాన్ని పెంచుకోవాలి, ఓట్లను పుంజుకోవాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏవిధంగా చూసినా కూడా ప్రతిపక్ష కూటమికి ఈ ఎన్నికలు ఉనికి పోరాటంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వలసల సెగలకు లోనైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఈ ఎన్నికలు ఓ కఠిన పరీక్షగానే కనిపిస్తున్నాయి.
వచ్చే నెల 21న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిలు జరపాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రచార వేడి పుంజుకుంది. కేంద్రంలో రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నిక కూడా ఇదే. 2014లో 122 సీట్లు గెల్చుకున్న బీజేపీ ఈసారి గణనీయంగానే తన బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 2014-19 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో దుమ్మురేపిన బీజేపీ 288 సీట్లు గల అసెంబ్లీలో ఈసారి గణనీయంగానే విజయాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న విదర్భ, మరాఠ్వాడా, ముంబయి ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనపడడం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అన్నివిధాలుగా కలిసివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మొదటినుంచి పశ్చిమ మహారాష్టల్రో బలమైన పట్టును కనబరుస్తూ వచ్చిన శరద్ పవార్ నాయకత్వానికి ఈసారి ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. కొంకణ్ ప్రాంతంలో మాత్రం శివసేన తన పట్టును బిగిస్తూ వస్తోంది. అయితే, విజయావకాశాలపై దృష్టి పెట్టిన బీజేపీ తన బలహీనతలను కూడా అధిగమించేందుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంతోనే కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి గత రెండు నెలలుగా సీనియర్ నేతలను ఆకర్షిస్తూ వచ్చింది. ఆ విధంగా సంస్థాగతంగా తాము బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో రాజకీయ పట్టును బిగించేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ద్వితీయ స్థానానికి పరిమితం కావడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహా జనాదేశ్ యాత్రను మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్ 140 నియోజకవర్గాల్లో దాదాపు 4వేల కిలోమీటర్ల మేర పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ యాత్ర రెండు రోజుల క్రితమే ముగిసింది. కాగా, ఐదు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చిన శరద్ పవార్‌కు వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికలు అత్యంత కఠినమైనవిగానే కనిపిస్తున్నాయి. పవార్‌నే లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యూహాత్మకంగా సాగించిన దాడులే అందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారాస్త్రాలుగా బలమైన ఆయుధాలే ఉన్నాయి. అభివృద్ధి, రుణ మాఫీతోపాటు కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి జాతీయ అంశాలు కూడా రాజకీయ లబ్ధికి కమలనాథులు వాడుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీలకు కరవు కాటకాలు, ఆర్థిక మాంద్యం, రైతాంగం అవస్థలు, నిరుద్యోగం బలమైన ఆయుధాలుగా ఉన్నా అవి ఎంతమేరకు వాటిని ఆదుకుంటాయన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. 2014లో శివసేన-బీజేపీ, ఎన్సీపీ-కాంగ్రెస్ కూటములుగా ఏర్పడ్డా చివరిక్షణంలో అవి బెడిసికొట్టాయి.
అప్పట్లో జరిగిన చతుర్ముఖ పోటీలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. తాజా ఎన్నికల్లో ఉమ్మడి పోటీకి సంబంధించి బీజేపీ, శివసేన మధ్య ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం చెరో 125 సీట్లలో పోటీ చేయాలని సంకల్పించాయి. ప్రతిపక్ష కూటమిలో చిన్న పార్టీలకు 38 సీట్లు మిగిలాయి.
*చిత్రాలు.. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ *ఎన్‌సీపీ నేత శరద్ పవార్ *శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే