జాతీయ వార్తలు

దేనికైనా సిద్ధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ చేయబోయే ప్రతిదాడులను తిప్పి కొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలను ఆదేశించారు. ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడికి ప్రతిగా భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు బుధవారం అర్థరాత్రి ఆక్రమిత కాశ్మీర్‌లో మూడు కిలోమీటర్ల లోపల ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై దాడులు చేసిన అనంతరం నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఉదయం భద్రతా దళాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ప్రత్యేక దళాలకు చెందిన పారాట్రూపర్లు జరిపిన దాడి, దీనికి ప్రతిగా పాకిస్తాన్ ప్రతిదాడులకు పాల్పడే అవకాశాలపై చర్చించారు.
ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్, సైన్యాధ్యక్షుడు దల్బీర్‌సింగ్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. సర్జికల్ దాడులపై పాకిస్తాన్ ఏవిధంగా స్పందిస్తుందనే అంశంపై సమావేశంలో చర్చించారు. భారత సైన్యం తమ భూభాగంలో ఎలాంటి సర్జికల్ దాడులు చేయలేదని, ఎల్‌ఓసి వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తమ సైన్యానికి చెందిన ఇద్దరు జవాన్లు మాత్రం మరణించారంటూ బుకాయిస్తున్న పాకిస్తాన్ సైన్యం తమకు అనుకూలంగా ఉండే సమయంలో భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చి దాడులు చేయవచ్చు లేదా హిబ్జుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా తదితర ఇస్లామిక ఉగ్రవాద సంస్థల ద్వారా జమ్ముకాశ్మీర్‌తోపాటు దేశంలోని ఇతర ముఖ్యమైన పట్టణాల్లో దాడులు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.
పాకిస్తాన్ సైన్యం జరిపే ఎలాంటి ప్రతి చర్యనైనా తిప్పికొట్టేందుకు సైన్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ సైనికపర చర్యకు దిగితే ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనకు వచ్చిందని అంటున్నారు. గతంలో ఒకసారి ఇలాంటి అవకాశం వచ్చినా అప్పటి ప్రభుత్వం ఉపయోగించుకోలేదనీ, ఈసారి మాత్రం అవకాశాన్ని జార విడుచుకోవద్దనే అభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు. ఉరీ సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి జరిపి 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న తరువాత పాకిస్తాన్‌ను దెబ్బ తీసేందుకు ఇంతవరకు తీసుకున్న చర్యలను కూడా ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలిసింది. ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ది చెప్పేందుకు మొదటి చర్యగా సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామనే సందేశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పంపించింది.
ఇది జరిగిన అనంతరం ఇస్లామాబాద్‌లో నవంబర్‌లో జరుగవలసిన సార్క్ దేశాల సదస్సుకు హాజరు కాకూడదని నిర్ణయించటం తోపాటు మిత్ర దేశాలు కూడా ఈ సదస్సుకు హాజరు కాకుండా చేయగలిగారు. దీనితో 2016 సార్క్ సదస్సు రద్దయింది. ఆ తరువాత పాకిస్తాన్‌కు కల్పించిన అత్యంత సానుకూల దేశం హోదాను తొలగించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఒక వైపు నుండి పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేస్తూనే, మరోవైపు బుధవారం రాత్రి సైనిక చర్యకు దిగటం ద్వారా మోదీ ప్రభుత్వం తమ పట్టుదలను ప్రదర్శించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులను ప్రయోగిస్తే సైనిక చర్య తప్పదనే గట్టి సందేశాన్ని పాకిస్తాన్‌కు పంపించటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది.

చిత్రం.. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం