జాతీయ వార్తలు

దేశాభివృద్ధిని అడ్డుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్కీ దాద్రి/తానేసర్, అక్టోబర్ 15: అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న భారత్‌ను వెన్నుపోటు పొడవద్దని విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా ఎంతగా మాట్లాడినా ఇబ్బంది ఉండదు కానీ దేశాభివృద్ధిని అడ్డుకునే చర్యలకు పాల్పడవద్దని ఆయన స్పష్టం చేశారు. తాజాగా మరోసారి 370 అధికరణకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే కాశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని చెప్పాలంటూ మరోసారి కాంగ్రెస్‌కు ఆయన సవాల్ విసిరారు. మంగళవారం హర్యానాలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన 370 అధికరణ రద్దుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ‘మోదీని ఎంతగానైనా తిట్టుకోండి. కావాలంటే బ్యాంకాక్, థాయ్‌లాండ్, వియత్నాం లేదా మరెక్కడ నుంచైనా పదాలు తెచ్చుకోండి గానీ దేశ ప్రతిష్టను తప్పుడు ప్రచారంతో దెబ్బతీయకండి’ అని ప్రధాని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. కాశ్మీర్‌ను హింసాత్మక పరిస్థితుల నుంచి రక్షించి, అభివృద్ధిబాటలో పట్టించాలన్న బలమైన అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమైందని, అందుకే 370 అధికరణను రద్దు చేశామని వివరించిన మోదీ ‘మీరు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు కదూ’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాశ్మీర్‌పై నిర్ణయం తీసుకున్నామని, యావత్ భారతావని ఇందుకు మద్దతు పలికిందని ఆయన తెలిపారు. ఈ ర్యాలీల్లో సైనిక కుటుంబీకులు, మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా ప్రజలు ప్రతిపక్ష పార్టీకి గట్టిగా సమాధానం చెబుతారని వెల్లడించిన మోదీ ‘దేశ హితానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ పార్టీని శిక్షించాలా? వద్దా?’ అని ప్రజలకు ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రాష్ట్రం అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, మళ్లీ తమకు ప్రజలు పట్టం కట్టడం ఖాయమని మోదీ తెలిపారు. చర్కీ దాద్రీలో బీజేపీ అభ్యర్థిగా మల్లయోధురాలు బబితా ఫొగట్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దంగల్ సినిమా గురించి మోదీ ప్రస్తావించారు. తాను ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తమిళనాడులో సమావేశమైనపుడు దంగల్ చిత్రాన్ని తాను చూసినట్టుగా ఆయన చెప్పారని అన్నారు. అంతేకాదు, ఆడపిల్లలు ఎంతటి అద్భుతాన్నైనా సాధించగలరన్న అభిప్రాయాన్ని కూడా ఆ సందర్భంగా జిన్‌పింగ్ వ్యక్తం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ఆడపిల్లలు తమ ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో..బేటీ పడావో కార్యక్రమం హర్యానా గ్రామాల మద్దతు లేకుండా విజయవంతం అయి ఉండేదే కాదని ఆయన పేర్కొన్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ హర్యానా వనితలు తమ ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్న మోదీ మళ్లీ బీజేపీ గెలిస్తే ఈసారి రెండు దీపావళులేనని తెలిపారు. ఒక దీపావళి బీజేపీ విజయానికి సంకేతమైతే, మరో దీపావళి ప్రగతి వెలుగుకు నిదర్శనమని అన్నారు.
*చిత్రం...హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం చర్కీ దాద్రిలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ