జాతీయ వార్తలు

మాటిచ్చి మరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెవారి (హర్యానా), అక్టోబర్ 19: అసెంబ్లీ ఎన్నికల ప్రచార చివరి రోజైన శనివారం ప్రధాని నరేంద్ర మోదీ తన విమర్శల ఉధృతిని పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని హర్యానాలో జరిగిన పలు ర్యాలీల్లో ఆయన తీవ్ర స్వరంతోనే విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించిన 370 అధికరణను రద్దు చేస్తామని 1964లోనే అప్పటి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దాదాపు ఐదు దశాబ్దాలు దాటినా కూడా ఈ అధికరణ రద్దు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మోదీ అన్నారు. 1964లో కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించి పార్లమెంటులో జరిగిన చర్చలో అప్పటి అత్యున్నత నాయకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, కాంగ్రెస్ పార్టీలో కూడా విభేదాలు తలెత్తాయని మోదీ గుర్తు చేశారు. 370 అధికరణను రద్దు చేయడంతోపాటు దానిపై పార్లమెంటులో చర్చ జరగాలన్న డిమాండ్ కూడా అప్పట్లో తలెత్తిందని ఆయన తెలిపారు. దానికి స్పందించిన అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ‘ఏడాది కాలంలో 370 అధికరణను రద్దు చేస్తాం’ అని ప్రకటించిందని మోదీ తెలిపారు. ఆ తర్వాత ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసలు ప్రస్తావించలేదని, పూర్తిగా అటకెక్కించేశాయని ప్రధాని ఈ ర్యాలీలో అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, అసలు 370 అధికరణను ఎందుకు రద్దు చేయలేదో ప్రశ్నించాలని ప్రజలను మోదీ కోరారు. గత 70 ఏళ్లుగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు, జవాన్ల త్యాగాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని, ఏ ఒక్క సంస్మరణ కేంద్రాన్ని నిర్మించలేదని, కానీ అధికారంలో వచ్చిన కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే సైనిక త్యాగాలను బీజేపీ గుర్తించిందని, వారికోసం సంస్మరణ కేంద్రాలను నిర్మించిందని తెలిపారు. 370 అధికరణ వల్ల ఏళ్ల తరబడి కాశ్మీర్‌కు కలిగిన కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకుని దానిని తమ పార్టీ రద్దు చేసిందని, కానీ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఆ రాష్ట్రానికి సంబంధించిన కేవలం రెండు కుటుంబాల ప్రయోజనం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు. అలాగే, మరోపార్టీ కాశ్మీర్‌లో ఎదగకుండా అన్నిరకాలుగా అడ్డుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలకు అధికారమే ముఖ్యం తప్ప కాశ్మీర్ ప్రయోజనాలు ఎప్పుడూ పట్టలేదని అన్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన పార్టీ మళ్లీ ఓట్ల కోసం వస్తోందని, దానిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. మారుతున్న యుద్ధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సైనిక దళాల ఆధునికీకరణకు తమ ప్రభుత్వం విశేష ప్రధాన్యత ఇచ్చిందని, ఆధునిక ఆయుధాలను సమకూర్చిందని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశామని, జవాన్లకు బులెట్ ప్రూఫ్ జాకెట్లను అందించామని మోదీ తెలిపారు. వీటిని దేశంలోనే తయారుచేస్తూ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు పేట్రేగిపోయారని పేర్కొన్న మోదీ ‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తూ వస్తున్నాం. దేశాన్ని అన్నివిధాలుగాను శక్తివంతంగా తీర్చిదిద్దాం’ అని తెలిపారు. ఇలానాబాద్‌లో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలు అనుసరించిన విధానాల వల్ల భారతదేశం అన్నివిధాలుగా బలహీనపడిందని అన్నారు. ఆ పార్టీ అనుసరించిన తప్పుడు విధానాలు, వ్యూహాల వల్లే ఆ రకమైన పరిస్థితి తలెత్తిందని తెలిపారు. 370 అధికరణ తాత్కాలికమేనని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేస్తే, తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ దానిని 70 ఏళ్లు కొనసాగించిందని ఆయన అన్నారు.
*చిత్రం...హర్యానాలోని సిర్సాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉద్వేగభరితంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ