జాతీయ వార్తలు

పాక్ ఉగ్ర కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలో పెద్దఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పగబట్టిన పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని ఇంటలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. పాకిస్తాన్ సైన్యం తోడ్పాటుతో జైషె మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో విధ్వంసానికి పథకాలు రచిస్తున్నాయని, ఈ కుట్ర ప్రస్తుతం వ్యూహ రచన స్థితిలోవుందని ఇంటలిజెన్స్ వర్గాలు కేంద్రానికి అందించిన నివేదికలో హెచ్చరించినట్టు చెబుతున్నారు. దేశంలోని సైనిక స్థావరాలతోపాటు ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకూవున్న దాదాపు 2350 కిలోమీటర్ల సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు పెద్దఎత్తున దాడికి సిద్ధమవుతున్నాయని, వారికి అనుకూలంగా ఉండే సమయం, స్థలంలో దాడి జరుగొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని పెద్ద మెట్రో నగరాలపై ఇస్లామిక్ ఆత్మాహుతి దళాలు దాడి చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ముంబయిలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు లేదా సముద్ర మార్గంలో వచ్చి విధ్వంసం సృష్టించినట్టు మరోసారి చేయాలన్నది పాక్ సైన్యం, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ లక్ష్యమని అంటున్నారు. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌లో అసలు సర్జికల్ దాడులు జరపలేదని పాక్ ప్రభుత్వం, సైన్యం చెప్పటం ప్రత్యేక వ్యూహంలో భాగమేనని అంచనా వేస్తున్నారు. సర్జికల్ దాడులు జరిగినట్టు అంగీకరిస్తే నిర్ణీత కాలంలో ప్రతి దాడులు జరపాల్సిన బాధ్యత పాక్ సైన్యంపై ఉంటుంది. సర్జికల్ దాడులు జరగలేదని చెప్పటం ద్వారా పాక్ సైన్యం ప్రతి దాడి చేయాల్సిన అవసరం లేకుండా చేసి, అనంతరం ఇస్లామిక్ ఉగ్రవాదం ముసుగులో పాక్ సైన్యం, ఉగ్రవాదులు భారత్‌పై తెగబడేందుకు పన్నాగం పన్నుతున్నారని అంటున్నారు. ఆదివారం రాత్రి బారాముల్లా సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదుల చేసినటువంటి దాడులను కొనసాగిస్తూనే, పాక్ సైన్యం మరోవైపు అదనుచూసి పెద్ద దాడి చేయవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పాక్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదుల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకూ సైన్యాన్ని అత్యంత అప్రమత్తం చేయటంతోపాటు పలుచోట్ల ప్రత్యేక దళాలను మొహరించినట్టు తెలిసింది. వాయుసేన, నావికాదళం, తీర గస్తీ దళాలను పూర్తి అప్రమత్తతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు పొడువునా సైనిక మొహరింపు ఆశించిన విధంగా ఉన్నదా? లేదా? అనేది పరిశీలించేందుకు సీనియర్ సైనికాధికారులను సరిహద్దు వెంటవున్న అన్ని రాష్ట్రాలకూ పంపుతున్నారు. నిఘావర్గాలు 24 గంటలూ పని చేసేలా చర్యలు తీసుకున్నారు. దేశంలోని అన్ని కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశాలు వెళ్లాయి. దేశంలోని నాలుగు పెద్ద మెట్రో నగరాలతోపాటు రెండోస్థాయిలో ఉన్న బెంగళూరు, హైదరాబాదు, నాగపూర్ తదితర నగరాల్లోనూ ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే సరిహద్దు వెంటవున్న రాష్ట్రాల సిఎంలతో టెలిఫోన్‌లో మాట్లాడారు. పాక్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సరిహద్దు రాష్ట్రాల సిఎంలకు సూచించినట్టు తెలిసింది. పాక్ సైన్యం గత ఇరవై నాలుగు గంటల్లో మూడు చొరబాట్లకు చేయూతనిచ్చి విఫలమైంది. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండటంతో ఇస్లామిక్ ఉగ్రవాదులు పాక్ సైన్యం సాయంతో మన దేశంలోని చొచ్చుకొచ్చేందుకు చేసిన మూడు ప్రయత్నాలు వమ్మయ్యాయి. అయినా దాదాపు నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు కంచెను కత్తిరించి మన దేశంలోకి వచ్చి బారాముల్లాలోని భద్రతాదళాల క్యాంపులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. భద్రతా దళాలు పెద్దఎత్తున ప్రతిస్పందించటంతో ఇస్లామిక్ ఉగ్రవాదులు స్థానిక ప్రజలను కవచంగా వాడుకుని తప్పించుకున్నారు. భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులతో పాకిస్తాన్ కోమాలోకి వెళ్లిందనటం నిజం కాదని నిఘా వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. పాక్ సైన్యం, జైషె మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు సమయం కోసం చూస్తున్నాయని, వారికి అనుకూలంగా ఉండే సమయంలో మనపై విరుచుకుపడతాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

చిత్రం.. సరిహద్దుల భద్రతపై మీడియాతో మాట్లాడుతున్న రాజ్‌నాథ్