జాతీయ వార్తలు

సీఎం భద్రత కోసమే 191 కోట్ల విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 8: గుజరాత్ ప్రభుత్వం 191 కోట్ల రూపాయల వెచ్చించి విమానం కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని అధికార బీజేపీ సమర్ధించింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ప్రముఖుల కోసం కొత్త జెట్ విమానాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం భద్రత దృష్ట్యా అంత ఖరీదైన విమానం ఉండాల్సిందే, ఇందులో ఏమాత్రం తప్పులేదని అధికార పార్టీ చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న విమానం పాతబడిపోయిందని కూడా పార్టీ పేర్కొంది.
రెండు ఇంజన్లు, 12 సీట్ల బాంబర్ చాలెంజర్ -650 విమానం కొనుగోలుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. భద్రత పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలకు దిగాయి. ప్రతిపక్షాల విమర్శలను రాష్ట్ర బీజేపీ కొట్టిపారేసింది. ‘ఇప్పుడు వాడుతున్న 1999 నాటి బీచ్‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ విమానం, 2007 నాటి హెలీకాప్టర్‌కు నిర్వహణ వ్యయం ఏడాదికి రూ. 5 కోట్లు అవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త విమానం కొనడమే సరైంది’అని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇరవై ఏళ్లనాటి విమానంలో ప్రయాణించడం ముఖ్యమంత్రికి ఏ మాత్రం భద్రత ఉండదని భావించే కొత్తదాన్ని కొనుగోలు చేస్తున్నట్టు బీజేపీ పేర్కొంది. ప్రభుత్వం హెలీకాప్టర్ పనితీరు ప్రమాదకరంగా మారిందని, 2017లో రెండు సార్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పార్టీ తెలిపింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భద్రతతోపాటు పలు అంశాలను దృష్టిలో పెట్టుకునే 2017 నుంచి ప్రైవేటు హెలీకాప్టర్ వినియోగించాల్సి వస్తోందని వివరించారు. పాత విమానం, హెలీకాప్టర్ నిర్వహణ వ్యయం ఏడాదికి ఐదు కోట్ల రూపాయల అవసరమా?అని భావించిన తరువాతే 12 సీటర్ల కొత్త విమానం కొనుగోలు చేస్తున్నట్టు కమలనాథులు తెలిపారు. ‘సామాన్య పౌరుడే ఓ వాహనాన్ని పదేళ్లు వాడిన తరువాత దాని వినియోగం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో 20 ఏళ్లనాటి విమానం సీఎం ఎలా వినయోగిస్తారు?’అని బీజేపీ ప్రశ్నించింది. భద్రతావసరాల కోసమే కొత్త విమానం కొనుగోలు చేస్తున్నారే తప్ప విలాసం కోసం కాదని అధికార పార్టీ సమర్ధించుకుంది. ప్రైవేట్ జెట్‌లు, హెలీకాప్టర్ల కోసం గంటకు లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, ఈపరిస్థితుల్లో అత్యాధునికమైన విమానం ఉండడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ పేర్కొంది.
కొత్త విమానం ఒక్క సీఎంకే కాదు, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ వాడుకోవచ్చని చెప్పుకొచ్చింది. అధికార బీజేపీ విలాసాల పాలన చేస్తోందని గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్డా ధ్వజమెత్తారు. వర్షాభావ పరిస్థితులతో రాష్ట్ర రైతులు కష్టాల్లో ఉంటే వాళ్లను పట్టించుకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా?అంటూ ట్వీట్ చేశారు. రాజధానిలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలంటే విమర్శలు చేస్తున్న బీజేపీ రూ. 191 కోట్లు ఖర్చుపెట్టి విమానం కొనుగోలు చేస్తోందని ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ధ్వజమెత్తారు.