జాతీయ వార్తలు

ఆలయం దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ట్రస్ట్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ రెండో తేదీ నాడు శ్రీరామ నవమి రోజు అయోధ్యలో రామాలయం నిర్మాణం పనిని ప్రారంభించే అవకాశాలున్నాయి. రామ నవమి రోజు భూమి పూజ జరుగుతుందా లేక శంకుస్థాపన జరుగుతుందా? అనేది స్పష్టం కావటం లేదు. ఎందుకంటే 1989లో రామనవమి రోజు ఉద్రిక్తతల మధ్య దేవాలయ నిర్మాణానికి సంబందించిన శంకుస్థాపన లాంటిది నిర్వహించటం తెలిసిందే. వచ్చే రామనవమి రోజు భూమి పూజ లేదా శంకుస్థాపన.. ఏది చేసినా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించవచ్చునని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వారం పది రోజుల్లో సుప్రీం కోర్టు సూచించిన విధంగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ జరుగుతోందని వారు చెబుతున్నారు. ట్రస్ట్‌లో సంఘ్ పరివార్ సంస్థలతోపాటు ఇతర ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలున్నట్లు తెలిసింది. తీర్పు వెలువడినప్పటి నుండి మూడు నెలల్లోగా అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి రామాలయం నిర్మాణం చేపట్టేందుకు 2.77 ఎకరాల భూమిని అప్పగించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అదేశించటం తెలిసిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ శ్రీరామ నవమి రోజు రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేసిన తరువాత దాదాపు మూడేళ్లలో దేవాలయం నిర్మాణం పూర్తవుతుందని అంటున్నారు. విశ్వహిందూ పరిషత్ ఇప్పటికే అయోధ్యలో నిర్మించవలసిన శ్రీరాముడి ఆలయానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేసి పెట్టడంతోపాటు శిలలు చెక్కించడం కూడా ప్రారంభించింది. దేవాలయం
నిర్మాణానికి అవసరమైన రెండువందల యాభై స్తంభాల్లో 110 స్తంభాల తయారీ పూర్తయింది. గర్భగుడి నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలను చెక్కటం ముఖ్యంగా పాలరాతి శిలాఫలకాలను తీర్చిదిద్దే కార్యక్రమం కూడా కొంతవరకు జరిగింది.
మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ తయారు చేయించిన ప్లాన్ ప్రకారం రామాలయాన్ని నిర్మించేందుకు అంగీకరిస్తుందా లేక కొత్త ప్లాన్ సిద్ధం చేయాలనుకుంటుంటా? అనేది ముఖ్యమైన విషయం. విశ్వహిందూ పరిషత్ తయారు చేసి పెట్టిన ప్లాన్ ప్రకారం రామాలయ నిర్మాణానికి దాదాపుమూడేళ్లు పడుతుందని అంటున్నారు. విశ్వహిందూ పరిషత్ తయారు చేయించిన ప్లాన్‌కు బదులు మరో ప్లాన్ సిద్ధం చేయించాలని ట్రస్ట్ నిర్ణయించే పక్షంలో శ్రీరాముడి దేవాలయ నిర్మాణానికి ఐదారు సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో నిర్మించే శ్రీరాముడి దేవాలయం దేశానికి గర్వకారణం కావాలనీ.. తరతరాల వరకు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండడంతోపాటు హిందూ సంస్కృతి, సభ్యతకి అద్దేపట్టే విధంగా భవ్యమైన దేవాలయ నిర్మాణం జరగాలని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. దేవాలయం ప్లాన్ ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం, సంఘ్ పరివార్ ఇతర సంస్థలతోపాటు నిర్మోహీ అకారా, శ్రీరాం జన్మభూమి న్యాస్‌కు అమోదయోగ్యంగా ఉండాలి. ట్రస్ట్ ఏర్పాటైన వెంటనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సమావేశమై ఈ అంశంపై దృష్టి సారిస్తుందని అంటున్నారు.
ఇదిలాఉంటే సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించవలసిన ఐదెకరాల భూమిని ఎంపిక చేసేందుకు అయోధ్య జిల్లా యంత్రాంగం అనే్వషణ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఆదేశం మేరకు అయోధ్య జిల్లా యంత్రాంగం అనువైన భూములను ఎంపిక చేసే పని ప్రారంభించింది. అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు జరిగే నాటికి ముస్లింలకు కేటాయించవలసిన ఐదెకరాల భూమిని కూడా సిద్ధం చేయవలసి ఉంటుంది. మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించే ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా? అనేది సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించవలసి ఉన్నది. ప్రభుత్వం కేటాయించే ఐదెకరాల భూమిపై మసీదు నిర్మించేందుకు ఖురాన్ అంగీకరించదని కొందరు ముస్లిం నాయకులు వాదిస్తున్నారు. వక్ఫ్ భూమిపై మాత్రమే మసీదును నిర్మించేందుకు ఖురాన్ అంగీకరిస్తుంది తప్ప ప్రభుత్వం నుండి తీసుకునే భూమిపై నిర్మించేందుకు అంగీకరించదని వారు వాదిస్తున్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఈ నెల 26న సమావేశమై ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. మసీదు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే భూమిని తీసుకోవద్దని హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేయడం తెలిసిందే.

*చిత్రం...అయోధ్యలోని కరసేవక్‌పురంలో ఏర్పాటు చేసిన రామాలయం నమూనా