జాతీయ వార్తలు

వాస్తవాలే రాయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రజలకు వార్తలను యథాతథంగా అందించాలి తప్ప పత్రిక భావాలు, అభిప్రాయాలను జోడించకూడదని ఉప రాష్ట్రపతి వెంక య్యనాయుడు వార్తాపత్రికలు, టీవీ మీడియాకు హితవు చెప్పారు. శనివారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వాస్తవికత లేకుండా సంచలనం ఉంటేనే వార్త అవుతుందనే ఆలోచన సరికాదని ఆయన స్పష్టం చేశారు. ‘రిపోర్టింగ్-ఇంటర్‌ప్రిటేషన్ ఏ జర్నీ’ ఇతివృత్తంతో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది.. ఇలాంటి పరిస్థితిల్లో వార్తాపత్రికలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నదని సూచించారు. రాజకీయ పార్టీలు, నాయకులు తమకు అనుబంధంగా, తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు వార్తాపత్రికలు, చానళ్లలను ఏర్పాటు చేసుకునే పద్ధతి ప్రారంభమైందని వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపార, స్వీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం పత్రికా రంగంలోకి వస్తున్నాయని అన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంస్కృతి మరింత పెరుగుతోంది.. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదని స్పష్టం చేశారు. జర్నలిజం ‘మిషన్’ కావాలి కానీ.. ‘కమిషన్’ కాకూడదని అన్నారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు స్వీయ నియంత్రణ అంశాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలని హితవు పలికారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాలు ఈ దిశగా ఆలోచించాలని ఉప రాష్ట్రపతి సూచించారు. జర్నలిజం వౌలిక విలువలకు తిలోదకాలివ్వటం సరికాదు.. సంచలనాలకి ప్రాధాన్యమిచ్చి వాస్తవానికి దూరం కావద్దని వెంకయ్య నాయుడు హితవు పలికారు. గతంలో ఒక పత్రిక చదివితే సమగ్ర సమాచారం లభించేది.. ఇప్పుడు నాలుగైదు పత్రికలు చదివితేకానీ నిజాలు తెలియటం లేదని ఆయన వాపోయారు. రాంనాథ్ గోయంకా, సీఆర్ ఇరానీ, నిఖిల్ చక్రవర్తి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన జర్నలిస్టులకు సూచించారు. స్వాతంత్య్రోద్యమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు వెలికితీయటంలో పత్రికలు గణనీయమైన పాత్రను నిర్వహించాయని ఆయన గుర్తుచేశారు. పత్రికలు అభివృద్ధిని ప్రోత్సహించే బాధ్యతలను తీసుకోవాలి. స్వచ్ఛ భారత్, భేటీ బచావ్- భేటీ పడావ్, ఫిట్ ఇండియా, పర్ డ్రాప్-మోర్ క్రాప్, ఏక ఉపయోగ ప్లాస్టిక్ నిషేధం తదితర ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియా మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మార్చటంలో మీడియా పాత్ర గణనీయమైందని వెంకయ్య నాయుడు తెలిపారు. భాషా పత్రికలను ప్రభుత్వత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మాతృభాషలో వచ్చే పత్రికలను ప్రజలు మరింత ఆసక్తిగా చదువుతారనే విషయాన్ని దృష్టలో పెట్టుకోవాలని అన్నారు. పశ్చిమ దేశాల్లో భారతదేశంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని భారతీయ జర్నలిస్టులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాభీష్టం మేరకే తాత్కాలికమైన నిబంధనగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేశారని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవ హక్కుల అణచివేత, మతపరమైన వివక్ష పాశ్చాత్య దేశాలకు గుర్తుకు రాకపోవటం విచారకమని అన్నారు. జర్నలిజంలో విశిష్ట సేవలకుగాను రాజస్థాన్ పత్రిక యజమాని గులాబ్ కొఠారీకి ‘రాజారామ్ మోహన్ రాయ్ అవార్డు’ను వెంకయ్య నాయుడు బహూకరించారు. ఉత్తమ కథనాలు అందించిన పలువురు జర్నలిస్టులకు కూడా ఆయన అవార్డులు అందజేశారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావ్డేకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*చిత్రం... జర్నలిజంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి జవడేకర్, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ సీకే ప్రసాద్