జాతీయ వార్తలు

ముందస్తు చర్యలతోనే కాశ్మీర్‌లో శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకొన్న ముందస్తు చర్యల వల్ల శాంతి భద్రతలను పరిరక్షించగలిగామని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఈ ముందస్తు చర్యల వల్లే ఇంతవరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. 370 అధికరణ రద్దుకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తకుండా శాంతి భద్రతలను కాపాడినందుకు అభినందించాల్సిందేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు స్పష్టం చేశారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకొన్న తరువాత ముందస్తు నిరోధక చర్యలను తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగిందని.. లేనిపక్షంలో అరాచక పరిస్థితులు తలెత్తేవని ఆయన తెలిపారు. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసి ఉండకపోతే ఉగ్రవాదులకు వేలాదిగా మెసేజ్‌లు వెళ్లిపోయేవని దానివల్ల హింసాకాండ, అరాచక పరిస్థితులు రాష్ట్రంలో తాండవించి ఉండేవని ఆయన తెలిపారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం ఆగస్టు ఐదో తేదీ నుంచి ఈ రకమైన చర్యలను అమలు చేస్తూ వచ్చిందని దీనివల్ల ఆశించిన ఫలితం ఒనగూడిందని వేణుగోపాల్ తెలిపారు. గతంలో కాశ్మీర్ పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని అన్నారు. 2016లో గుర్హన్‌వని సహా ముగ్గురు కరడుగట్టిన టెర్రరిస్టులను హతమార్చిన తరువాత మూడు నెలల పాటు రాష్ట్రంలో ఆంక్షలు విధించారని.. అలాంటి సమయంలో ఆంక్షలకు వ్యతిరేకంగా ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని వేణుగోపాల్ తెలిపారు. కానీ ఇప్పుడు 20కి పైగా సవాలు పిటిషన్‌లు దాఖలయ్యాయని ఆయన గుర్తు చేశారు. వీటిని కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, కాశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధా ఆశ్రీన్ తదితరులు దాఖలు చేశారని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీన ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం చారిత్రకమైనదని, 70 సంవత్సరాల కాశ్మీర్ చరిత్రలోనే అనూహ్యమైనదని ఆయన అన్నారు. ఇంత కఠినమైన చర్య తీసుకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు అనివార్యమయ్యాయని.. అవి ఫలితం ఇవ్వడం వల్లే ఒక్క బులెట్ కూడా పేలలేదని.. హింసాకాండ వల్ల ఏ ఒక్క మరణం సంభవించలేదని చెప్పారు. ఇంత ముందు జాగ్రత్తతో వ్యవహరించినందుకు.. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనని తెలిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం తీరుతెన్నులను ప్రస్తావించిన ఆయన.. ‘కొన్ని సంవత్సరాల పాటు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించే వారు.. వారికి స్థానిక మిలిటెంట్లు, వేర్పాటువాద శక్తులు సహకరించేవి.. ఫలితంగా పౌరులు అనేకరకాలుగా అవస్థలకు గురయ్యేవారు’ అని వేణుగోపాల్ అన్నారు. అలాంటప్పుడు 370 అధికరణ రద్దు తరువాత ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండకపోతే పౌర జీవనం అతలాకుతలం అయిపోయేదని పేర్కొన్నారు.