జాతీయ వార్తలు

ఎలాంటి భయమొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్‌బాద్ (జార్ఖండ్), డిసెంబర్ 12: ఈశాన్య రాష్ట్రాల ప్రజల భాష, సంస్కృతి, ప్రత్యేక గుర్తింపును తమ ప్రభుత్వం పూర్తిగా పరిరక్షిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ పౌరసత్వ సవరణ బిల్లుపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎవరూ ఏవిధంగానూ భయపడాల్సిన అవసరం లేదని, ఈ ప్రాంత అన్ని ప్రత్యేకతలను అత్యంత ప్రాధాన్యతాపూర్వకంగా పరిరక్షిస్తామని మోదీ తెలిపారు. ‘మోదీపై మీరు నమ్మకం ఉంచండి. ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. సంస్కృతి, భాష సురక్షితంగా ఉంటుంది. మీ జీవనశైలినీ పరిరక్షిస్తాం’ అని ఈశాన్య ప్రజలకు, ముఖ్యంగా అస్సాం ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలోని పౌరులకు ఈ బిల్లు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, దీనిని వ్యతిరేకిస్తున్నవారే తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని మోదీ అన్నారు. ‘అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల దాడులు జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ కుటుంబాలు భారత్ వచ్చాయి. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకోలేదు’ అని మోదీ అన్నారు. కానీ ఇప్పుడు మతపరమైన అణచివేతలకు గురై, భారత్ వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని మోదీ అన్నారు. జాతి ప్రయోజనాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలను తీసుకోలేకపోయాయని విమర్శించారు. జార్ఖండ్ కూడా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి లబ్ధి చేకూరలేదని, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలే కొరవడ్డాయని ఆయన విమర్శించారు. తానెప్పుడూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడలేదని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశానని ప్రధాని తెలిపారు. రామజన్మ భూమి సమస్యను దశాబ్దాలపాటు పెండింగ్‌లో ఉంచింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీకి జాతి ప్రయోజనాల కంటే కూడా సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. అలాగే, జార్ఖండ్ ఏర్పాటును కూడా ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ వాయిదా వేస్తూ వచ్చిందని, కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ వెనకాడదని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందుకోసం ఎంతదూరమైన వెళ్తుందని స్పష్టం చేశారు. 370 అధికరణను రద్దు చేయడం ద్వారా కాశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేశామని, అలాగే రామ జన్మభూమి వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరిస్తామని చెప్పి ఆ లక్ష్యాన్ని నెరవేర్చామని మోదీ తెలిపారు. అలాగే ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయోనన్న భయంతో తలాక్ బిల్లును కూడా కాంగ్రెస్ వాయిదా వేస్తూ వచ్చిందని, కానీ తాము ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముస్లిం మహిళల కోసం దీనిని రద్దు చేశామని ప్రధాని తెలిపారు. రాష్ట్రంలో జేఎంఎం, ఆర్జేడీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అధికారమే పరమావధి అని, ఈ కూటమికి ఎలాంటి ఆశయంగానీ, ఆలోచించే శక్తిగానీ లేదని అన్నారు. రాష్ట్రంలో నక్సలిజం వేళ్లూనడానికి, అభివృద్ధి కుంటుపడడానికి ఈ పార్టీయే కారణమని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలకు నమ్మకం పోవడానికి కారణం ఆ పార్టీ ఆలోచనలు, విధానాలేనని ఆయన తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి తాను కట్టుబడి పనిచేస్తానని, సంపద పట్ల తనకు ఎలాంటి ఆశ లేదని మోదీ తెలిపారు. తన క్షేమాన్ని ఫణంగా పెట్టి అయినా దేశ ప్రజల క్షేమం కోసం తాను పాటుపడతానని ఆయన అన్నారు.
*చిత్రం...జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ