జాతీయ వార్తలు

స్వగ్రామంలో గ్రేవాల్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భివాని/న్యూఢిల్లీ, నవంబర్ 3: ఒకే ర్యాంక్, ఒకే పన్ను విధానం అమలుపై కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన హర్యానాకు చెందిన మాజీ సైనికుడు రామ్ కిషన్ గ్రేవాల్ అంత్యక్రియలు భివానీ సమీపంలోని ఆయన స్వగ్రామంలో జరిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా, గ్రేవాల్ మృతిపై బుధవారం మొదలైన రాజకీయ దుమారం గురువారం కూడా సద్దుమణగలేదు. గ్రేవాల్ మానసిక స్థితిపై నిన్న అనుమానాలు వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి వికె సింగ్ గురువారం మరో అడుగుముందుకేసి ఆయన కాంగ్రెస్ మనిషంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్‌బబ్బర్ ఆర్మీ మాజీ చీఫ్ కూడా అయిన వికె సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టగా గ్రేవాల్ కుమారుడు సైతం మాజీ సర్పంచ్ అయిన తన తండ్రి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయలేదని ప్రకటించడం గమనార్హం.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గ్రేవాల్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గ్రేవాల్ పోరాటాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రేవాల్ ఆత్మహత్యను రాజకీయం చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా గ్రేవాల్ ఆత్మహత్య కేసును ఢిల్లీ పోలీసు క్రైమ్‌బ్రాంచ్‌కి అప్పగించారు. భివానీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బమ్లా గ్రామంలో గురువారం మధ్యాహ్నం గ్రేవాల్ పెద్ద కుమారుడు దిల్వార్ తండ్రి చితికి నిప్పంటించారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో జనం అంత్యక్రియలకు హాజరయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సంఘటనల దృష్ట్యా గురువారం అంత్యక్రియల సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీనుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించిన రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల పాటు గ్రేవాల్ కుటుంబ సభ్యులతో గడిపారు. రాహుల్‌తో పాటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా, పిసిసి అధ్యక్షుడు అశోక్ తన్వార్, శాసన సభలో కాంగ్రెస్ పక్ష నాయకురాలు కిరణ్ చౌదరి, మాజీ కేంద్రమంత్రి కుమారి సెల్జా, కుల్దీప్ బిహ్ణోయి, పార్టీ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఓ బ్రియాన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. భివానీ సమీపంలోని బామ్లాలో జరిగిన మాజీ సైనికుడు
రామ్ కిషన్ గ్రేవాల్ అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ