జాతీయ వార్తలు

బస్సు నదిలో పడి 18మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండి, నవంబర్ 5: హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఒక ప్రైవేటు బస్సు బియాస్ నదిలో పడి 18 మంది మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. మనాలి నుంచి కుల్లుకు వెళ్తున్న ఈ ప్రైవేటు బస్సు మండి జిల్లాలోని వింద్రావని ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. ఒక మోటర్ సైకిలిస్టును ఢీకొనకుండా తప్పించడానికి డ్రైవర్ ప్రయత్నించినప్పుడు బస్సు అదుపు తప్పి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో పడిపోయిందని ఒక పోలీసు అధికారి చెప్పారు. ప్రయాణికుల్లో 14 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు మండిలోని జోనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తి సిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మండి నుంచి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో గాయపడిన వారిని మండిలోని జోనల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మండి డిప్యూటి కమిషనర్ సందీప్ కదం, ఐజి అజయ్ యాదవ్ సహాయక బృందాలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులు నదిలో కొట్టుకుపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా ఎవరయినా గల్లంతయి ఉంటే రక్షించటానికి గజ ఈతగాళ్లను కూడా రప్పించామని సందీప్ కదం తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. అధికారులు తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు రూ.15వేల చొప్పున, గాయపడిన వారికి రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్, మంత్రులు మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారిని అన్ని రకాలుగా ఆదుకోవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం.. ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది