జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: వీసాలు, వ్యవస్థీకృత నేరాలువంటి అంశాలపై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు ప్రారంభించాలని భారత్, బ్రిటన్ సోమవారం నిర్ణయించాయి. ఉగ్రవాదంపైనా ఆందోళన వ్యక్తం చేసిన ఇరు దేశాలు, ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశ భద్రతకు సంబంధించిన సవాలే కాదని, అనేక దేశాలు, ప్రాంతాలకు ఇది విస్తరించి ఉందని పేర్కొన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణవంటి విస్తృత అంశాలపై సోమవారం ఇక్కడ లోతుగా చర్చలు జరిపిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మే, అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2008లో ముంబయి నగరంపైనా, ఈ ఏడాది పఠాన్‌కోట్ సైనిక స్థావరంపైనా జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. పెరుగుతున్న మత ఛాందసవాదం, ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి పోరాడటానికి ఉన్న మార్గాలపై చర్చించినట్లు ఈ ఇద్దరు నేతలు వెల్లడించారు. ‘ఉగ్రవాదం అనేది ఒక దేశానికి సంబంధించిన భద్రతా సమస్య కాదని, ఇది దేశాలు, ప్రాంతాలకు విస్తరించిందనే అంశాన్ని మేమిద్దరం అంగీకరించాం. ఉగ్రవాదులు స్వేచ్ఛగా దేశాల సరిహద్దులు దాటి సంచరిస్తున్నారు. మొత్తం మానవాళికే ప్రమాదకరంగా పరిణమించారు. సీమాంతర ఉగ్రవాదంపై మా ఆందోళనను, ఉగ్రవాదానికి మద్దతిస్తూ ప్రోత్సహిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం గురించి నేను ప్రధాని థెరెసా మేకు తెలియజేశాను’ అని మోదీ చెప్పారు. ఉభయ దేశాలు వేర్వేరు దేశాలుగా, భాగస్వామ్య దేశాలుగా, ప్రపంచ శక్తులుగా ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొంటున్నాయని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అన్నారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ముఖ్యంగా ఉగ్రవాదుల ఇంటర్నెట్ వినియోగాన్ని అడ్డుకోవడానికి ఇరు దేశాలు కలసి పనిచేయాలనే అంగీకారానికి తాము వచ్చామని ఆమె వివరించారు. వీసాలు, రిటర్న్స్, వ్యవస్థీకృత నేరాలు సహా హోం వ్యవహారాలపై వ్యూహాత్మక చర్చలను ప్రారంభించాలని తాము అంగీకారానికి వచ్చామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా తాము బ్రిటన్‌లో ఉండే అర్హత లేని భారతీయులను తిరిగి వేగంగా వెనక్కి పంపిస్తామని ఆమె వివరించారు.
సెప్టెంబర్‌లో యురీలోని భారత సైనిక బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రవాద దాడిని థెరెసా మే తీవ్రంగా ఖండించారని, అమర సైనికులకు సంతాపం ప్రకటించారని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారని ఇరు దేశాల ప్రధానుల చర్చల అనంతరం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటన తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందిన కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వనీని పాకిస్తాన్ అమరవీరుడిగా అభివర్ణించడాన్ని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులను ఎవరూ కీర్తించొద్దని, ఉగ్రవాదులను మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అని విభజించడానికి ప్రయత్నించొద్దని సంయుక్త ప్రకటన హితవు పలికింది. దక్షిణాసియా సుస్థిరంగా, సౌభాగ్యవంతంగా, ఉగ్రవాదం లేని ప్రాంతంగా ఉండాలనే అంగీకారానికి వచ్చిన ఇరు దేశాల ప్రధానులు ఈ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదంపైనా పోరాడాలనే దృఢ చిత్తాన్ని ప్రదర్శించిన ఇరు దేశాల నేతలు ఏ కారణం చేతనూ ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించకూడదని నొక్కి చెప్పారని సంయుక్త ప్రకటన వివరించింది.

చిత్రం.. న్యూఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశానికి ముందు బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ