జాతీయ వార్తలు

ప్రధాని మాట్లాడరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: నోట్ల రద్దు వ్యవహారం ఉభయ సభలను గురువారం కూడా కుదిపేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బ తీసేలా నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి మోదీ సభకు వచ్చి ఎందుకు జవాబివ్వటం లేదని పెద్దల సభలో విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారకుడైన మోదీ సభకు వచ్చి సమాధానమిచ్చేంత వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగనిచ్చేది లేదని విపక్షాలు భీష్మించుకున్నాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించటంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైదంటూ విపక్ష సభ్యులు సభాకార్యక్రమాలను స్తంభింపజేశాయి. పెద్ద నోట్ల రద్దుపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలంటూ పట్టుబట్టాయి. మోదీ రాజ్యసభకు రావలసిందేనని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉభయ సభల్లోనూ ఒకే పరిస్థితి. విపక్ష సభ్యులంతా స్పీకర్, చైర్మన్ పోడియంల వద్దకు వచ్చి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీనితో లోక్‌సభ మూడుసార్లు, రాజ్యసభ ఆరుసార్లు వాయిదా పడింది.
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగానే కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు వచ్చి తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 193 రూల్ కింద వెంటనే చర్చ జరిపేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. 53 రూల్ కింద చర్చ చేపట్టి ఓటిగ్ జరపాలని కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇచ్చారు. దీనితో సుమిత్రా మహాజన్ విపక్ష సభ్యుల నినాదాల గొడవ మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తరువాత కూడా సభలో గొడవ కొనసాగటంతో ఆమె సభను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా పరిస్థితి మారకపోవటంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. లోక్‌సభ తిరిగి సమావేశమైనా ఆందోళన కొనసాగటంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ప్రధాన మంత్రి రావలసిందే
రాజ్యసభలో గురువారం సభ ప్రారంభం నుంచే గందరగోళం మొదలయ్యింది. పెద్దనోట్ల రద్దుపై జరుగుతున్న చర్చకు సమాధానం ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు రావాలంటూ ప్రతిపక్షం పట్టుపట్టింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటంతో విపక్ష సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ కార్యక్రమాలను స్తంభింపజేశాయి. సభ నియంత్రణకు ఉపాధ్యక్షుడు పిజె కురియన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మొదట పది నిమిషాలు, ఆ తరువాత మధ్యాహ్నం పనె్నండు నుండి 12.30 గంటల వరకు, ఆ తరువాత 2గంటలకు సభను పలుమార్లు వాయిదా వేశారు. రెండు గంటలకు సమావేశమైనప్పడు కూడా ప్రతిపక్షం గొడవ చేయటంతో కురియన్ సభను మరో గంటపాటు వాయిదా వేశారు. మూడు గంటలకు తిరిగి సమావేశమైన తరువాత అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి సభకు రావాలనే మిషతో చర్చకు మీరు అడ్డుకుంటున్నారు, చర్చను అడ్డుకోవటం ద్వారా మీరు అవినీతిపరులు, నల్లధనం కలిగి ఉన్న వారికి కొమ్ము కాస్తున్నార’ని ఆరోపించారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ సమాధానం ఇస్తూ జమ్ముకాశ్మీర్‌లోని ఉరీ జిల్లాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం మూలంగా మరణించిన వారికంటే నోట్లకోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి మరణించినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. ఆజాద్ చేసిన ఈ వ్యాఖ్యలకు సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్వరంతో స్పందించారు. ‘పెద్దనోట్ల రద్దు వ్యవహారంలోకి పాకిస్తాన్‌ను ఎందుకు తెస్తున్నారు, మీరు ఈ వ్యాఖ్యలతో దేశాన్ని అవమానిస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యల మూలంగా దేశం మండిపోతుంది’ అని విరుచుకు పడ్డారు.
ఆజాద్ క్షమాపణ చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని వెంకయ్య డిమాండ్ చేశారు. ఆజాద్ సైతం దీటుగా జవాబిచ్చారు. ‘మీరు పాకిస్తాన్‌లో పెళ్లిళ్లు, కార్యక్రమాలకు హాజరై కార్పెట్లు పరుస్తున్నారు, మీరా నాకు చెప్పేది’ అని అన్నారు. ప్రభుత్వం తప్పుడు విధానం మూలంగా నలభై మంది మరణించారని ఆయన ఆరోపించారు. దీనికి ఎవరిని శిక్షించాలని ఆజాద్ నిలదీశారు. బిజెపి సభ్యులు లేచి ఆజాద్‌ను విమర్శించటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో కురియన్ సభను రేపటి వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం.. రాజ్యసభలో గురువారం మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్