జాతీయ వార్తలు

కుదురుకున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 19: కాశ్మీర్ కుదురుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత వేర్పాటువాదులు రాజేసిన అగ్గి నాలుగు నెలల తరువాత నివురుగప్పుకుంది. కాశ్మీర్ లోయలో వేర్పాటువాదులు తమ ఆందోళనలకు రెండు రోజుల పాటు విరామం ప్రకటించారు. దాదాపు 133రోజుల తరువాత కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయ అంతటా శనివారం కార్యాలయాలు, దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు తెరచుకున్నాయి. జూలై 8న భద్రతా దళాల కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీ మృతి చెందడంతో కాశ్మీర్ లోయ అంతటా అసాధారణ స్థాయిలో తలెత్తిన అశాంతి, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ నాలుగు నెలల్లో రేగిన హింసలో 86 మంది మృతి చెందగా, 5వేల మంది భద్రతా సిబ్బంది సహా అనేక మంది గాయపడ్డారు. అయితే కొన్ని వారాలుగా లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అశాంతి నెలకొన్న తరువాత మొదటిసారి శనివారం దుకాణాలు, కార్యాలయాలు, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య సంస్థలు రోజు మొత్తం పనిచేశాయి. అంతకుముందు ఆందోళనలకు విరామమిచ్చిన రోజుల్లోనూ, అప్పుడప్పుడు కొన్ని గంటల్లో మాత్రమే పనిచేశాయి. ప్రజా రవాణాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం, ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు బయటకు రావడంతో శనివారం శ్రీనగర్ రోడ్లపై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. లోయలోని ఇతర జిల్లాల కేంద్రాల్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు ఇక్కడికి సమాచారం అందింది. పరిస్థితి మెరుగు పడటంతో అధికారులు శుక్రవారం రాత్రి పోస్ట్‌పెయిడ్ నంబర్లకు మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. అయితే ప్రీపెయిడ్ నంబర్లకు ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. అయితే కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొనటానికి పెద్ద నోట్ల రద్దు కూడా కారణం కావచ్చని విశే్లషిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కానీ, వేర్పాటు వాద సంస్థల నుంచి కానీ అవసరమైనంత నిధుల సరఫరా లేకపోవటం వల్లనే ఆందోళనలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. లోయలో ఆందోళనలకు యువతను సమీకరించలేకపోవటానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నారు.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: లోయలో ఆందోళనలు తగ్గుముఖం పట్టి పరిస్థితులు చక్కబడటానికి ఉష్ణోగ్రతలు కూడా కారణమవుతున్నాయి. ఇదిలాఉండగా, కాశ్మీర్ డివిజన్ వ్యాప్తంగా ఘనీభవన బిందువు కన్నా దిగువకు పడిపోయిన కనీస ఉష్ణోగ్రతలు కొద్ది తేడాతో అదేవిధంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతల్లో స్వల్ప స్థాయిలో మెరుగుదల కనిపిస్తోంది. కాశ్మీర్ లోయలో దట్టమైన పొగమంచు కప్పుకొని ఉంది. రాష్ట్రంలో అత్యంత శీతల ప్రాంతంగా లడఖ్ రీజియన్‌లోని కార్గిల్ పట్టణం రికార్డయింది. ఇక్కడ మైనస్ 8.4 కన్నా తక్కువ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. శుక్రవారం రాత్రి ఇక్కడ మైనస్ 9.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.

చిత్రం.. శ్రీనగర్ మార్కెట్ వీధుల్లో శనివారం కనిపించిన జనం హడావుడి