జాతీయ వార్తలు

చిట్‌ఫండ్ మృతుల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా, నవంబర్ 20: అవినీతి కార్యకలాపాలతో కోట్లకు కోట్లు సంపాదించిన వారికి తీవ్ర విఘాతం కలిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తనపై ధ్వజమెత్తుతున్న పార్టీల ఆరోపణలను తిప్పికొట్టారు. పెద్దనోట్ల రద్దువల్ల దేశవ్యాప్తంగా అనేకమంది మరణించారంటూ తనపై బురద జల్లుతున్నారని, తనను తప్పుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పిన మోదీ, చిట్‌ఫండ్ కుంభకోణం సందర్భంగా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో ఎవరికి తెలియదని అన్నారు. పెద్ద కరెన్సీని రద్దు చేయడం వల్ల తీవ్ర విఘాతానికి గురైన రాజకీయ నాయకులే తన ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని ఆయన అన్నారు. గత 70 సంవత్సరాలుగా నల్లధనంపై కాంగ్రెస్ ప్రభుత్వాలు వౌనం వహించడానికి కారణం ఎక్కడ అధికారం పోతుందోనన్న భయమేనని కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడ పరివర్తన ర్యాలీలో మాట్లాడిన మోదీ జన్‌ధన్ ఖాతాల్లో ఇతరుల డిపాజిట్లను ఎంతమాత్రం అనుమతించవద్దని హెచ్చరించారు. ఈ విధంగా సంపన్నులకు అవకాశం ఇస్తే అలాంటి వ్యక్తులు చట్టప్రకారం చర్యలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దును ఏరకమైన వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారో తనకు తెలుసునని, చిట్‌ఫండ్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. చిట్‌ఫండ్‌ల్లో అమాయక ప్రజలు డిపాజిట్ చేసిన లక్షలు, కోట్ల రూపాయలను దిగమింగారని, అవన్నీ కూడా రాత్రికి రాత్రే మాయమైపోయాయని మోదీ అన్నారు. కష్టపడి దాచుకున్న సొమ్ము హరించుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో వందలాదిమంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. గతాన్ని ఓసారి పరికిస్తే తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అసలు వ్యక్తుల ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతుందని తెలిపారు. నాలుగు రోజులుగా పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఇతర రాజకీయ పార్టీలతో మమతా బెనర్జీ చేతులు కలుపుతున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. తన ప్రసంగంలో ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా నల్లధనానికి కొమ్ముకాస్తున్న వ్యక్తులే తన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని మోదీ అన్నారు. రానున్న ఆరేళ్ల కాలంలో దేశంలోని ప్రతి ఒక్కరికి ఆవాసాన్ని కల్పిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆగ్రాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన ఆయన తన ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అంకితమై పనిచేస్తుందని తెలిపారు. తాము చేపట్టిన పథకాలన్నీ కూడా పేదల సమగ్ర వికాసానికి ఉద్దేశించినవేనని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగివుండాలన్న ఉద్దేశంతో గతంలో జన్‌ధన్ యోజనను ప్రారంభించామనీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆవాసాన్ని అందించాలన్న ఉదాత్త సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను చేపట్టామని తెలిపారు. ఇదే సందర్భంగా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ స్టవ్‌ను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను కూడా మోదీ ప్రారంభించారు.

చిత్రం.. ఆగ్రాలో ఆదివారం ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలను అందజేస్తున్న నరేంద్ర మోదీ