జాతీయ వార్తలు

120మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుఖ్రాయన్ (యూపీ), నవంబర్ 20:ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 120మంది దుర్మరణం చెందారు. మరో 200మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాట్నా వెళుతున్న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14బోగీలు పట్టాలు కాన్పూర్ గ్రామీణ ప్రాంతమైన పుక్రాయన్ వద్ద పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దెబ్బతినడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రయాణికులందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో నాలుగు సాధారణ స్లీపర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఎస్-1, ఎస్-2 కోచ్‌లు ఒకదానిలోకి మరొకటి దూసుకు పోయాయి. ఈ రెండు బోగీల్లో ఉన్న ప్రమాణికులే ఎక్కువ సంఖ్యలో మరణించారు. ఎస్-3, ఎస్-4కోచ్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎసి -3టైర్ కూడా దెబ్బతిన్నప్పటికీ ఇందులో సంభవించిన మరణాలు తక్కువేనని అధికారులు తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న బోగీల్లో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత మేర సురక్షితంగా బయటికి తీసేందుకు ప్రయత్నించారు. మొదట్లో మృతుల సంఖ్య తక్కువేనని కథనాలు వచ్చినప్పటికీ క్షణక్షణం అవి పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రానికి బోగీల నుంచి 110 మృత దేహాలను వెలికి తీసి కాన్పూర్ రూరల్ మార్చురీకి తరలించారు. మృతుల్లో 43మందిని గుర్తించామని, వీరిలో 20మంది యూపీకి, 15మంది మధ్యప్రదేశ్‌కు, ఆరుగురు బీహార్‌కు చెందిన వారని యూపీ డిజిపి జావీద్ అహ్మద్ చెప్పారు. 27 మృత దేహాలపై పోస్టుమార్టం పూర్తి చేసి వారి బంధువులకు అప్పగించామన్నారు. వీటిని తరలించేందుకు అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశామని, క్షతగాత్రులను ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని అధికారులు తెలిపారు. 76మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయని, మరో 150మంది స్వల్పంగా గాయపడ్డారని కాన్పూర్ రేంజి ఐజి జకీ అహ్మద్ తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ ప్రాతిపదికన చికిత్స అందించేందుకు వీలుగా అన్ని ఆసుపత్రుల్ని అప్రమత్తం చేశామని,వీరిని తరలించేందుకు 30 అంబులెన్స్‌లను వినియోగించామన్నారు. రైలు పట్టాలు దెబ్బతిన్న కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా స్పష్టం అవుతోందని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. రైల్వే ఇంజనీరింగ్ విభాగం ఇందుకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటుందన్నారు.
అనేక బోగీలు వంగిపోయి వంకర్లు తిరిగిపోవడంతో వాటిలో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించేందుకు కోల్డ్ కట్టర్లను ఉపయోగించారు. గ్యాస్ కట్టర్లను ఉపయోగించడం వల్ల అతిగా వేడి వల్ల వీరికి మరింత ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సహాయ సంక్షేమ చర్యల్లో సైనిక, పోలీసు బృందాలతో పాటు సైనిక వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాద స్థలానికి వెళ్లి వ్యక్తిగతంగా సహాయ చర్యల్ని పర్యవేక్షించాలని రాష్ట్ర డిజిపిని ముఖ్యమంత్రి అఖిలేష్ ఆదేశించారు. క్షతగాత్రుల్ని తీసుకెళ్లే అంబులెన్స్‌లకు ఎలాంటి అంతరాయం కలుగకుండా వాటి మార్గంలో ట్రాఫిక్ లేకుండా చూడాలని కూడా స్పష్టం చేశారు. ప్రమాద కారణంగా ఆగిపోయిన ప్రయాణికుల్ని వారివారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశామన్నారు.

చిత్రం.. పట్టాలు తప్పిన పాట్నా - ఇండో ఎక్స్‌ప్రెస్ రైలు.. చెల్లాచెదురైన బోగీలు