జాతీయ వార్తలు

ఉభయ సభల్లోనూ ‘రద్దు’ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: పార్లమెంటు ఉభయ సభలు నాలుగోరోజు సోమవారం కూడా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే గొడవలు, గందరగోళం మధ్య మంగళవారానికి వాయిదాపడ్డాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం మూలంగా లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడితే, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడిన అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడక తప్పలేదు.
ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల హోరులోనే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా నియమం 56 ప్రకారం తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేంత వరకు సభను కొనసాగనిచ్చే ప్రసక్తే లేదని ప్రతిపక్ష సభ్యులు స్పష్టం చేశారు. దీంతో లోక్‌సభ వాయిదాపడింది. లోక్‌సభ సోమవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ‘గలీ గలీ మే శోర్ హై, నరేంద్ర మోదీ చోర్ హై’ అంటూ ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నినదించారు. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ 56వ నిమయం ప్రకారం ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా వేసి తమ తీర్మానంపై చర్చ జరపవలసిందేనని పట్టుబట్టారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నానని, ప్రచారంకోసమే మీరంతా పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రతిపక్ష సభ్యుల చర్యల్ని తప్పుబట్టారు. పెద్దనోట్ల రద్దు గురించి 193 నియమం కింద చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టి ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం గొడవ మధ్యలోనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో మంగళవారానికి సభను వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే ఉపాధ్యక్షుడు పిజి కురియన్ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం ప్రకటించిన అనంతరం సభ్యులు రెండు నిమిషాలపాటు వౌనం పాటించారు. ఆ తర్వాత సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రైలు ప్రమాద మృతుల పట్ల సంతాప తీర్మానం చేసినట్లే, డబ్బుకోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరిన కోరుతూ సభలో తీర్మానాన్ని ఆమోదించాలని పట్టుపట్టారు. బిఎస్‌పి అధినేత మాయావతి, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా దీనికి మద్దతు పలికారు. అయితే కురియన్ మాత్రం ఇందుకు సమ్మతించలేదు. సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ప్రతిక్షం పెద్దనోట్ల అంశంపై చర్చనుండి పారిపోతోందని, ఏదో ఒక వంకతో సభను స్తంభింపజేస్తూ చర్చ జరగకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు కెఎం ఖాన్, టి.సుబ్బిరామిరెడ్డితో పాటు ప్రతిపక్షానికి చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నోట్లకోసం క్యూలో నిలబడి ప్రజలు మరణిస్తే, వారికి సేవచేస్తూ అలసిపోయి బ్యాంకు సిబ్బంది మరణిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంతాపం తెలపవలసిందేనని సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్, మాయావతి పట్టుపట్టటంతో సభ గందరగోళంలో పడిపోయింది. దీనితో కురియన్ సభను రెండుసార్లు వాయిదా వేశారు. సాయంత్రం మూడు గంటలకు సమావేశమైనప్పుడు కూడా రాజ్యసభలో గొడవ సద్దుమణగ లేదు. ‘ప్రధాన మంత్రి చోర్’ అంటూ ప్రతిపక్షం నినాదాలు ఇవ్వగా, ‘రాహుల్ గాంధీ చోర్’ అంటూ అధికార పక్షం నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. దీనితో కురియన్ సభను మంగళవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం.. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు ధరించి నినాదాలు చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు