జాతీయ వార్తలు

మూగవోయిన మురళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 22: నాదమహర్షి మహతి మూగబోయింది. తేనెలొలికే గాత్రమాధుర్యాన్ని ఎనిమిది దశాబ్దాల పాటు విశ్వమంతా ఒలికించిన మురళీగానం ఆగిపోయింది. సప్తస్వరాలు స్తబ్దమైపోయాయి. తిల్లానాకు ఊపిరినిచ్చిన ప్రాణవాయువు నిలిచిపోయింది. తన స్వరంతో వినూతనమైన రాగమాధుర్యాన్ని పొందిన 72మేళకర్తలూ తమ నేస్తాన్ని కోల్పోయాయి. ఈ శతాబ్ది వాగ్గేయకారుడు తన పని ముగించుకుని వెళ్లిపోయాడు. అపర త్యాగరాజస్వామి, కర్ణాటక సంగీత వాచస్పతి పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్తమించారు. కర్ణాటక శాస్ర్తియ సంగీతానికి మాధుర్యాన్ని కల్పించి ఖండాంతరాలకు తెలుగువారి ఖ్యాతిని వ్యాప్తి చేసిన నాదమహర్షి యావత్ భారత సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురి చేస్తూ అనంత లోకాలకు తరలిపోయారు. కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉన్న 86 సంవత్సరాల గాన గంధర్వుడు బాలమురళి చెన్నై కనకశ్రీనగర్‌లోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఒంట్లో నలతగా ఉండటంతో రెండు రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన చివరి క్షణాల్లోనూ రాగాలాపన చేస్తూనే కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని బిసెంట్‌నగర్ స్మశాన వాటికలో బాలమురళి అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. బాలమురళికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం బాగా లేకపోవటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం తిరిగి దెబ్బ తింది. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆయనకు సపర్యలు చేస్తుండగానే, ప్రశాంత చిత్తంతో రాగాలాపన చేస్తూ ఆయన మరణించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని స్వగృహంలోనే
ఉంచారు. భారత దేశ అత్యున్నత పౌరపురస్కారాలు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు మూడింటినీ అందుకున్న మహానుభావుడు బాలమురళి. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్న విఖ్యాత సంగీత చక్రవర్తి ఆయన. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా సంగీత లోకమే కాకుండా, రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపాలు వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి బాలమురళి మృతి తీరని లోటు అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బాలమురళి సంగీత ప్రపంచానికి రారాజు అని, ఆయన మృతి కర్ణాటక సంగీతానికి కోలుకోలేని నష్టమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్, నటుడు ధనుష్ సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్, తెలుగునాట పలువురు సంగీత విద్వాంసులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విశ్వనాథ్, తనికెళ్లభరణి తదితరులు బాలమురళి మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.