జాతీయ వార్తలు

మా నోరు నొక్కేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రజాస్వామ్యంతోపాటు ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని పదహారు ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు ప్రణబ్ ముఖర్జీని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో లోక్‌సభలో టిఎంసి పక్ష నాయకుడు సుదీప్ బంధోపాధ్యాయ, కాంగ్రెస్‌పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, సిపిఎం సీనియర్ నాయకుడు సలీం, జ్యోతిరాదిత్య సింధియా తదితర పదహారు పార్టీల నాయకులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఏకపక్షంగా వ్యవహరించటంపై ఒక వినతిపత్రం సమర్పించారు. ఆదాయ పన్ను సవరణ చట్టాన్ని లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండా గందరగోళం మధ్య ఆమోదించారని వారు ప్రణబ్ ముఖర్జీకి వివరించారు. ‘ఆదాయ పన్ను చట్టం సవరణ బిల్లుపై చర్చ జరగాలని తాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము, సవరణ బిల్లుకు ప్రతిపక్షం సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసుకున్నది’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని కోట్లాదిమంది బీద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన తాము పోరాడుతుంటే ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది, దీనివలన ప్రజాస్వామ్యానికి తీరని నష్టం వాటిల్లుతోందని టిఎంసి నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ హెచ్చరించారు. పదహారు ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా వ్యవహరిస్తే ప్రభుత్వం దిగిరాక తప్పదని ఆయన స్పష్టం చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తాము చేసిన ఫిర్యాదుపై చర్య తీసుకుంటారనే విశ్వాసం తమకున్నదని బందోపాధ్యాయ చెప్పారు. ప్రభు త్వం నియంతలా వ్యవహరిస్తోందని వామపక్షాల నాయకుడు సలీం ఆరోపించారు. ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని దారికి తెచ్చేందుకు ప్రతిపక్షం సమైక్యంగా వ్యవహరిస్తోందని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఆదాయ పన్ను చట్టం సవరణ బిల్లును చర్చ లేకుండా ఆమోదించటంపై మాత్రమే తాము రాష్టప్రతికి ఫిర్యాదు చేశామని రాహుల్ వివరించారు. దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

చిత్రం..పార్లమెంటులో ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని పదహారు
ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేస్తున్న దృశ్యం