జాతీయ వార్తలు

ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన సాయంపై ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి అందించారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జిఎస్‌టి గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు లేకుండా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీతో సమావేశమై పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాలకు ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా రాష్ట్ర పన్నుల రాబడి 25 నుంచి 30 శాతం వరకు తగ్గిందని జైట్లీకి చెప్పినట్టు మంత్రి ఈటల మీడియాకు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కనుక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు జిఎస్‌టి నష్టపరిహారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులకు సంబంధించిన
బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్రాన్ని కోరామన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ రుణ చెల్లింపులపై మారిటోరియం విధించాలనే ప్రతిపాదన కూడా చేసినట్టు రాజేందర్ వెల్లడించారు. దీనివలన రాష్ట్రాలకు కొంతవెసులు బాటు ఉంటుందన్నారు. రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునేందుకు వీలుకల్పించాలని కూడా ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర పన్నుల ఆదాయం తగ్గటం వలన బడ్జెట్ ప్రతిపాదనలు మారుతాయి. ఆర్థిక వ్యవస్థలో కొంత అలజడి రేగుతుంది. కాబట్టి ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రాన్ని అన్ని రాష్ట్రాలూ కోరినట్టు ఈటల వివరించారు. రాష్ట్ర ప్రణాళిక, బడ్జెట్ దెబ్బతినకుండా ఉండాలంటే కేంద్రం ఆర్థిక వెసులుబాటు కల్పించాలని జైట్లీకి సూచించామన్నారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా కేంద్రానికి వస్తున్న అదనపు ఆదాయం నుంచి రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదన కూడా చేశామన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలని కోరామన్నారు. రెండు వేల నోట్లను జారీ చేసిన నిష్పత్తిలో 500, 100 నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని జైట్లీకి సూచించామన్నారు. వేస్ అండ్ మీన్స్ వెసులుబాటు ఉండాలని సూచించామన్నారు. పెద్ద నోట్ల రద్దు మంచిదే కానీ, దీని అమలు సక్రమంగా లేదని, పేదలకు నష్టం వాటిల్లుతోందని కేంద్రానికి స్పష్టం చేశామని వివరించారు. రోజువారీ వ్యవసాయ, ఇతర కూలీలు, పేద వర్గాలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని అరుణ్ జైట్లీకి సూచించామన్నారు. జిఎస్‌టి సమావేశం 11, 12 తేదీలో ఉన్నది కాబట్టి, ఈ అంశాలపై అప్పుడొక అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.