జాతీయ వార్తలు

కెసిఆర్‌తో పేచీలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పొరుగు రాష్టమ్రైన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఏపీ సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు కుదురుకునే వరకూ చిన్నచిన్న ఇబ్బందులు ఉండేమాట వాస్తవమేనంటూ, అవేమీ వ్యక్తిగత విభేదాలు కావన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తానెప్పుడూ సిద్ధమేనని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు పిలుపునిచ్చామన్నారు. శనివారం ఢిల్లీలో హెచ్‌టి ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వనరులు, ఖనిజాలు ఉన్నాయని, స్నేహపూర్వక ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రలో గత ఏడాది 10.99 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద సముద్ర తీరం ఉందని, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతోపాటు కొత్తగా అమరావతి రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నట్టు వివరించారు. విజయవాడ, విశాఖపట్నం ఉండగా, కొత్తగా అమరావతి నిర్మాణం ఎందుకన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనతోపాటు అంతర్జాతీయ నగరం నిర్మించాలనే లక్ష్యంతో అమరావతి నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాదు నగరాన్నీ అదే లక్ష్యంతో విస్తరించినట్టు వివరించారు. హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాలకు అదనంగా సైబరాబాద్ నిర్మించానని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్చందంగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ఇవ్వటం ముదావహమని ప్రశంసించారు.
ప్రపంచ జల సంక్షోభం, పరిణామాలు అంశంపై మాట్లాడుతూ ఏపీలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టి సారిస్తున్నామని, విద్యా రంగానికీ పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పారు. అమరావతిలో పలు వర్శిటీల స్థాపన జరుగబోతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సిఎంగావున్న తొమ్మిదేళ్లలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య 30 నుంచి మూడు వందలకు తీసుకెళ్లామని వివరించారు. ఐటిలో తాను చేసిన కృషి ఫలితంగా తెలుగు విద్యార్థులు ప్రపంచమంతా వ్యాపించారని గర్వంగా చెప్పుకున్నారు. ఇదిలావుంటే సమ్మిట్‌కు హాజరైన క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌తో చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. నెల్లూరులో తాను దత్తత తీసుకున్న కె.పి. కండ్రిగ అభివృద్ధికి తాను తీసుకుంటున్న చర్యలను చంద్రబాబుకు సచిన్ వివరించారు. ప్రభుత్వం తరఫున దత్తత గ్రామాభివృద్ధికి సహకరిస్తానని బాబు హామీ ఇచ్చారు. అనంతరం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పాణిగరియాను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల గురించి చర్చించటంతోపాటు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను విస్తృతపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు మంతనాలు జరిపారు.