జాతీయ వార్తలు

ఉమ్మడి పోరు అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 4: ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కనె్నర్ర జేశారు. ఉగ్రవాద శక్తులపైనే కాకుండా వారికి మద్దతు ఇచ్చే, ఆశ్రయం కల్పించే, శిక్షణ, నిధులు సమకూర్చే వారిపైన కూడా కలిసికట్టుగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదం విషయంలో వౌనంగా ఉంటూ, ఎలాంటి చర్యా తీసుకోకపోతే ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే వారు మరింత బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంలో సాయం అందించేందుకు ఏర్పాటయిన ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ ఆరవ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, బయటి శక్తుల ప్రోద్బలంతో నెలకొన్న అస్థిరత అఫ్గానిస్థాన్ శాంతి, సుస్థిరతలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. అక్కడ పెచ్చుమీరుతున్న హింస ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. అది మొత్తం దక్షిణాసియాకే పెనుముప్పుగా పరిణమిస్తోంది’ అని ప్రధాని అందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా మనమంతా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యామని ఆయన చెప్పారు. ‘అఫ్గాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు కేవలం మాటలతో చెప్తే చాలదు. దానితో పాటుగా పటిష్ఠమైన చర్యలు కూడా ఉండాలి. కేవలం ఉగ్రవాద శక్తులపైనే కాదు, వారికి మద్దతు ఇచ్చే, ఆశ్రయం కల్పించే, శిక్షణ, నిధులు సమకూర్చే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల’ని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ అన్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీతో కలిసి సదస్సును ప్రారంభించిన తర్వాత మోదీ సమావేశానికి హాజరయిన వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ సహా 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అఫ్గానిస్థాన్‌లోను, దక్షిణాసియాలో హింసపై వౌనంగా ఉండడం, ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంవల్ల ఉగ్రవాద నేతలు, వారికి మద్దతు ఇచ్చే వారు మరింత బలపడతారని ప్రధాని అన్నారు. అఫ్గానిస్థాన్ అభివృద్ధికి, మానవతా అవసరాలకు ఈ ప్రాంత దేశాలు చేసే సహాయం మరింతగా పెరగాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. రక్తపాతాన్ని సృష్టించి భయోత్పాతానికి కారణమవుతున్న ఉగ్రవాద ముఠాలను కూకటివేళ్లతో తుదముట్టించడానికి ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని అంటూ, అఫ్గాన్ ప్రజలకు అండగా నిలవడంలో భారతదేశం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి సుస్థిరతలను పాదుగొల్పడానికి పూర్తిగా ఆ దేశ నేతృత్వంలోనే శాంతి ప్రక్రియ కొనసాగాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
శాంతికి పెనుముప్పు ఉగ్రవాదం
ఉగ్రవాదమే శాంతికి పెనుముప్పని, దానికి చరమగీతం పాడి తీరాల్సిందేనని హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు తీర్మానించింది. అంతేకాకుండా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లాంటి ఉగ్రవాద ముఠాల సురక్షిత స్థావరాలను తుదముట్టించాలని పిలుపునివ్వడం ద్వారా దాదాపు 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సు పాక్‌కు స్పష్టమైన హెచ్చరిక చేసింది. తాలిబన్, ఐఎస్‌ఐఎల్/ డాయిష్, దాని అనుబంధ సంస్థలు, హక్కానీ గ్రూపు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లాంటి విదేశీ ఉగ్రవాద ముఠాలు అఫ్గానిస్థాన్‌లో తీవ్రస్థాయిలో పాల్పడుతున్న హింసాకాండ ఆ దేశ శాంతి సుస్థిరతలకే పెనుముప్పుగా పరిణమిస్తోందని పేర్కొంటూ, ఉగ్రవాదానికి ఈ ప్రాంతంనుంచే మద్దతు లభిస్తోందనే విషయం సుస్పష్టమని, అందువల్ల తక్షణం అన్ని రూపాల్లోని ఉగ్రవాదానికి, వాటికి అందిస్తున్న అన్ని రకాల సాయాలకు స్వస్తి చెప్పాలని ఈ సదస్సు పిలుపునిస్తోందని రెండు రోజుల పాటు జరిగిన సమావేశం చివర్లో ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ పేర్లను డిక్లరేషన్‌లో తొలిసారిగా పేర్కొనడం గమనార్హం.