జాతీయ వార్తలు

చివరివరకూ హైడ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 5: జయలలిత మృతి చెందారన్న వార్త అధికారికంగా వెలువడే చివరి క్షణం వరకూ హైడ్రామా కొనసాగింది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందంటూ ఆసుపత్రి వర్గాలు పేర్కొంటే, తమిళనాడు చానెల్స్ మాత్రం ఆమె మృతి చెందారన్న వార్తను తొలుత ప్రసారం చేశాయి. అయితే, అపోలో ఆసుపత్రి వర్గాలు ఆ వార్తలను ఖండించడంతో, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన జయలలితకు అత్యాధునిక వైద్య సేవలు అందించిన విషయం తెలిసిందే. జయకు మొదట్నుంచీ వైద్యసహాయాన్ని అందిస్తున్న లండన్‌కు చెందిన రిచర్డ్ బేలే అక్కడి నుంచే అపోలో వైద్య బృందానికి ఆన్‌లైన్ ద్వారా సలహాలిచ్చారు. అపోలో ఆసుపత్రి వర్గాల కోరిక మేరకు అఖిలభారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్) నుంచి నలుగురు వైద్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందం సోమవారం తెల్లవారు జాము వరకే చెన్నై అపోలోకు చేరుకుని పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి జయలలితకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అపోలో అందించిందని, దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం నిలకడకు రాలేదని రిచర్డ్ బేలే సోమవారం ఉదయం ఒక ప్రకటన చేశారు. అయితే, మధ్యాహ్నం 2.45గంటలకు జయ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ముఖ్యనిర్వహణాధికారి సుబ్బయ్య విశ్వనాథన్ తొలి అధికారిక ప్రకటన చేశారు. జయ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ధ్రువీకరిస్తూనే, ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
నేతల సమీక్షలు
తమిళనాడు రాష్ట్రంతోపాటు కేంద్ర నాయకులు కూడా జయ లలిత ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అపోలో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జయ ఆరోగ్యం, జరుగుతున్న వైద్యం తీరుపై నివేదిక ఇచ్చారు. మరోవైపు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా అపోలో వైద్యులను సంప్రదించారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ దాదాపుగా ఆసుపత్రిలోనే ఉండిపోయారు.
హడావుడి.. గందరగోళం
జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వద్ద గందరగోళం నెలకొంది. హైడ్రా కొనసాగింది. ఓ వైపు వైద్యుల హడావిడి, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి, ఆసుపత్రికి వేల సంఖ్యలో చేరుకున్న జనసందోహంతో ఆ ప్రాంతం అంతా ఉత్కంఠగా మారింది. ఆసుపత్రిలోకి వచ్చి, వెళ్లే నేతలు, వైద్యులు, వాహనాల రొదే తప్ప అమ్మ ఆరోగ్యంపై రాత్రి సుమారు పనె్నండు గంటల వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. మధ్యాహ్నం అపోలో హెల్త్ బులెటిన్ విడుదల తరువాత భావోద్వేగాలు మరింత పెరిగిపోయాయి. దీనికి తోడు తమిళ మీడియాలో జయ కన్నుమూశారంటూ వార్తలు రావటంతో వాతావరణం వేడెక్కిపోయింది. అన్నాడిఎంకె కార్యకర్తల్లో రోదనలు మిన్నంటాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో జండాను అవనతం కూడా చేశారు. దీంతో అపోలో వెంటనే మరో బులెటిన్ విడుదల చేయాల్సి వచ్చింది. జయ మరణించారన్న వార్తలు సరైనవి కావని, ఆమెకు వైద్యం కొనసాగుతూనే ఉందని తేల్చిచెప్పింది. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తేల్చి చెప్పింది. ఆ తరువాత అన్నాడిఎంకె కార్యాలయంలో జండాను మళ్లీ పూర్తిగా ఎగురవేశారు.
రాత్రవుతున్న కొద్దీ ఉద్విగ్న వాతావరణం మరింతగా పెరిగిపోయింది. అటు అపోలో నుంచి కానీ, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎలాంటి సమాచారం జయ ఆరోగ్యం గురించి వెలువడకపోవటంతో కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయింది. బ్యారికేడ్లను ఛేదించుకుంటూ ఆసుపత్రిపై దాడికి తెగబడ్డారు. దీనితో ముందు జాగ్రత్త చర్యగా సాధారణ రోగులను ఆసుపత్రి నుంచి మరోచోటుకు తరలించారు. దాదాపు అదే సమయంలో అన్నాడిఎంకె అధికార ప్రతినిధి పేరుతో జయ ఆరోగ్యం గురించి ఒక ప్రకటన వెలువడింది. నలుగురు నిపుణులైన ఎయిమ్స్ వైద్య బృందం కృషితో జయలలిత వైద్యానికి స్పందిస్తున్నారంటూ సంక్షిప్తంగా పేర్కొన్నారు. దీనిపై అపోలో యాజమాన్యం నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణా రాలేదు. రాత్రి 11 గంటలకు ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం జయను మరోసారి పరీక్షించింది.
వైద్యులు వెళ్లిపోవడంతో అనుమానాలు
వైద్య పరీక్షల అనంతరం ఎయిమ్స్ వైద్యులు అపోలో నుంచి వెళ్లిపోవటంతో మరోసారి ఏం జరిగిందో అన్న ఆందోళన వ్యక్తమైంది. ఆమె మృతి చెంది ఉంటారన్న అనుమానం అందరిలోనూ బలపడింది. అప్పటి నుంచి వేగంగా పరిణామాలు మారిపోతూ వచ్చాయి. అన్నాడిఎంకె పార్టీలో తదుపరి కార్యాచరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర డిజిపి వెల్లడించారు. అపోలో ఆసుపత్రి నుంచి పోయెస్ గార్డెన్‌లోని ముఖ్యమంత్రి నివాసం దాకా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటు జయ సన్నిహిత సహచరుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రి 11 గంటల తరువాత పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. అనంతరం పన్నీర్‌సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. అంతకు ముందే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గవర్నర్‌ను కలిసి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు చెన్నై నగరంతో సహా తమిళనాడు అంతటా విషాద ఛాయలు నెలకొన్నాయి. అమ్మ ఆరోగ్యంతో తిరిగి రావాలని రాష్టమ్రంతటా ప్రార్థనలు జరిగాయి. రాష్టమ్రంతటా బంద్ వాతావరణం నెలకొంది. అనుమానాలను నిజం చేస్తూ అర్ధరాత్రి పనె్నండు గంటల సమయంలో జయ మృతిని అపొలో ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది.