జాతీయ వార్తలు

విప్లవ నాయికకు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 6: లక్షలాది జన హృదయ నేత అందరికీ వీడ్కోలు చెప్పి తల్లి ఒడిలోకి చేరిపోయింది. దేశమంతా శోకతప్తమై విప్లవనాయిక (పురచ్చితలైవి)ని భూదేవి చెంతకు చేర్చింది. సుదీర్ఘ అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయరామన్ జయలలితకు త్రివిధ దళాల సైనిక రాజలాంఛనాలతో మంగళవారం అత్యంత ఘనంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. అమ్మ కోరిక మేరకు ఆమె రాజకీయ గురువు ఎంజి రామచంద్రన్ సమాధి పక్కనే జయ భౌతిక ఖాయాన్ని ఖననం చేశారు. యావత్ దేశ రాజకీయ నాయకత్వం సమక్షంలో, లక్షలాది ప్రజల అలవికాని అశ్రుధారా ప్రవాహంలోనే అమ్మ తన తల్లి వద్దకు వెళ్లిపోయింది. కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయలలితకు హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారం చేస్తారని ప్రభుత్వం ముందుగా భావించారు. కానీ, తనను దహనం చేయవద్దని, ఎంజిఆర్ సమాధి పక్కనే ఖననం చేయాలన్నది ఆమె చివరికోరిక అని తెలియటంతో ఆ ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూసిన జయలలిత భౌతికకాయాన్ని ముందుగా పోయెస్‌గార్డెన్‌లోని ఆమె ఇంటికి తరలించారు. తెల్లవారుఝామున ఇంట్లో హిందూ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. జయకు అత్యంత ఇష్టమైన ఆకుపచ్చ పట్టుచీరను ధరింపజేసి రాజాజీ హాలుకు ప్రజల సందర్శనార్థం తరలించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమె భౌతిక కాయాన్ని దర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. సాయంత్రం 4.30గంటలకు రాజాజీ హాలు నుంచి బయలుదేరిన ఆమె అంతిమయాత్ర దారిపొడవునా ‘అమ్మా వాళ్‌గా’(అమ్మ అమర్ రహే) అన్న నినాదాలతో యావత్ తమిళనాడు ప్రజ ఆమెను సాగనంపింది. ఆద్యంతం అమ్మ వెంట ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ, జయ మేనల్లుడు దీపక్ అంటిపెట్టుకునే ఉన్నారు. మద్రాస్ యూనివర్సిటీ మీదుగా సాయంత్రం ఆరుగంటల ప్రాంతానికి మెరీనా బీచ్‌లోని బ్రిటిష్ కాలం నాటి పిడబ్ల్యుడి భవనానికి ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు ఆమె భౌతికకాయాన్ని చేర్చారు. దివంగత ఎంజిఆర్ సమాధికి పక్కన సరిగ్గా 20 అడుగుల దూరంలోనే ఈ వేదిక ఉంది. స్వచ్ఛమైన చందనంతో తయారు చేసిన అందమైన పేటికలో పట్టువస్త్రాలతో రూపొందించిన పరుపు, దిండుపై జయ భౌతికకాయాన్ని ఉంచారు. పేటికపై అమ్మ పేరును చెక్కించారు. ఆ తరువాత జయలలిత స్నేహితురాలు శశికళ, మేనల్లుడు దీపక్‌లు హిందూ వైష్ణవ పూజారుల సహకారంతో అంతిమ క్రియలు నిర్వహించారు. జయ భౌతిక కాయాన్ని ఉంచిన పేటికలో ముందుగా పవిత్రనదీ జలాలలో ప్రోక్షణ చేశారు. ఆ తరువాత చుట్టూ బియ్యం, గంధపు చెక్కలు, పూవులు చల్లారు. అనంతరం త్రివిధ దళాల సైనికులు గన్‌శాల్యూట్ చేస్తుండగా ఆమె పేటికను కార్యకర్తలు మూసివేసి ఖననం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇతర మంత్రులు, నాయకులు పూలు, పాలతో అమ్మకు తుది అభిషేకం నిర్వహించి, అంత్యక్రియలను పూర్తి చేశారు.

చిత్రం..భారీ భద్రతా బలగాల మధ్య కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అశేష జనవాహిని అశ్రునయనాల
మధ్య రాజాజీ హాలు నుంచి జయలలిత పార్థివ దేహాన్ని మెరీనా బీచ్‌కు తీసుకెళ్తున్న దృశ్యం