జాతీయ వార్తలు

‘ఉపాధి హామీ’కి రూ.12,230 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్‌ఆర్‌జిఏ) కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటానిధుల కింద రూ.12,230 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ పథకంకోసం ఒకేసారి ఇంత భారీగా నిధులు విడుదల చేయడం ఇదే మొదటిసారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంటోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి తమ మంత్రిత్వ శాఖ తన వంతు వాటా మొత్తం 12,230 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలు చెల్లించాల్సిన వేతన బకాయిలు చెల్లించడానికి, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఈ నిధులు ఉపయోగపడ్తాయని మంత్రి చెప్పారు.
ఎంజిఎన్‌ఆర్‌జిఏకోసం రాష్ట్రాలకు తగినన్ని నిధులు విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు గత బుధవారం కేంద్రాన్ని తీవ్రంగా మందలించడమే కాకుండా కరవుపీడిత రాష్ట్రాల్లో ఈ పథకంపై చేసిన ఖర్చు వివరాలను అందజేయాలని కూడా ఆదేశించింది. ‘మీరు నిధులు విడుదల చేయకపోతే అప్పుడు పని చేయడానికి ఎవరూ ముందుకు రారు. తమ వద్ద నిధులు లేవని, అందువల్ల ఈ పథకం కింద పనులకు ఎవరికీ చెల్లించలేమని రాష్ట్రాలు అంటాయి. ప్రజలకు రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి హామీ ఇవ్వలేవు’ అని జస్టిస్ ఎంబి లోకుర్, జస్టిస్ ఎన్‌వి రమణలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వేతన బకాయిల చెల్లింపులకోసం రూ.7,983 కోట్లు ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తారని, మెటీరియల్ బకాయిల కోసం రూ. 2,400 కోట్లు జూన్‌లో విడుదల చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ అప్పుడు కోర్టుకు తెలియజేశారు. కరవు పీడిత ప్రాంతాల్లో వేతన చెల్లింపులకోసం రూ 2,723 కోట్లు విడుదల చేస్తున్నట్లు కూడా ఆమె చెప్పారు.
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను, ఈ పథకం కింద చెల్లించాల్సిన వేతన బకాయిలు 8వేల కోట్ల మేర ఉన్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని మంత్రి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. నిజానికి గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద అయిన ఖర్చు రూ.41,371 కోట్లని, ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఈ పథకం కింద ఖర్చు చేసిన అత్యధిక మొత్తం ఇదేనని మంత్రి తెలిపారు. ఇందులో రూ.30,371 కోట్లు వేతనాల చెల్లింపుకోసమే ఖర్చు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. కరవు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, అలాగే సాగు నీటి సామర్థ్యం మెరుగుకు తోడ్పడే ఆస్తులను సృష్టించడానికి వీలుగా ప్రభుత్వం ఈ పథకంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చినట్లు మంత్రి చెప్పారు. పది కరవు పీడిత రాష్ట్రాల్లో ఈ పథకం కింద పని రోజులను వందనుంచి 150కి పెంచామని, ఈ రాష్ట్రాల్లో 20.48 లక్షల కుటుంబాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వంద రోజులకు పైగా పని రోజులు పూర్తి చేశాయని ఆయన తెలిపారు.