జాతీయ వార్తలు

భారత్‌ను విడదీసేందుకు పాక్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథువా (జమ్మూ-కాశ్మీర్), డిసెంబర్ 11: మతాన్ని ఆధారంగా చేసుకుని భారత్‌ను విడదీసేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే పాక్ ఎన్ని కుయుక్తులు పన్నినా అవి విజయవంతం కాబోవని ఆయన స్పష్టం చేశారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం కథువా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘మతం పేరుతో భారత్‌ను విడగొట్టేందుకు పాక్ కుట్ర చేస్తోంది. కానీ అటువంటి కుట్రలు ఫలించబోవు. మతం ప్రాతిపదికగా మనం 1947లో ఇప్పటికే ఒకసారి విడిపోయాం. ఆ విభజనను మనం ఇప్పటికీ మరువలేకపోతున్నాం. హిందూ మాత బిడ్డలైనా లేక ముస్లిం మాత బిడ్డలైనా భారతీయులంతా సోదరులే’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌లో ఇస్లామ్ మతానికి చెందిన 72 తెగలు కలసి మెలసి ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు భారత్ కట్టుబడి ఉందని దేశ హోం శాఖ మంత్రిగా తాను స్పష్టం చేయదల్చుకున్నానని ఆయన తెలిపారు. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఆ దేశం కట్టుబడి ఉంటే అందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో భారత్ శాంతిని కోరుకుంటోందని, అయితే దానిని అర్థం చేసుకోకుండా పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై పరోక్ష యుద్ధాన్ని సాగిస్తోందని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు.