జాతీయ వార్తలు

ఉగ్రవాదం అంతం కావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా గల ఇండోనేసియా అంగీకారానికి వచ్చాయి. ముఖ్యంగా ఉగ్రవాదం, దానికి అందుతున్న ఆర్థిక సాయం, మనీలాండరింగ్, ఆయుధాల స్మగ్లింగ్‌పై సమర్థవంతంగా పోరాడటానికి తీరప్రాంతంపై దృష్టి కేంద్రీకరించాలని, పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మధ్య సోమవారం ఇక్కడ జరిగిన చర్చలలో మంచి వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రత్యేకించి చమురు, గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, నైపుణ్యాభివృద్ధి రంగాలలో మరింత పెంచుకోవాలని నిర్ణయించాయి. అన్ని రూపాలలో ఉన్న ఉగ్రవాదాన్ని ఇరు దేశాల నేతలు తీవ్రంగా ఖండించినట్లు మోదీ, జోకో చర్చల అనంతరం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటన వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం సహించొద్దని నొక్కి చెప్పాయి. దక్షిణ చైనా సముద్రం వివాదాలను ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి కనె్వన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యుఎన్‌సిఎల్‌ఒఎస్) సహా సర్వత్రా అంగీకరించిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా శాంతియుత పద్ధతుల్లో ఈ వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఈ వివాదంలో భారత్‌తోపాటు ఇండోనేసియా కూడా కక్షిదారుగా ఉన్నది. ఇరు దేశాల మధ్య రాకపోకలను మెరుగుపరచడంతోపాటు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఇరు దేశాల నేతలు జకార్తా నుంచి ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించాలని గరుడ ఇండోనేసియా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సంస్థలను ఎదుర్కోవడానికి సంబంధించి ఐరాస భద్రతా మండలి తీర్మానం 1267, ఇతర సంబంధిత తీర్మానాలను అమలు చేయాలని మోదీ, విడోడో అన్ని దేశాలకు పిలుపునిచ్చారని సంయుక్త ప్రకటన వివరించింది. పాకిస్తాన్‌కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐరాస ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరు దేశాల నేతలు ఈ పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయడంతోపాటు ఉగ్రవాదుల స్వర్గ్ధామాలను, వౌలిక సదుపాయాలను నిర్మూలించడానికి, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, వారి ఆర్థిక మార్గాలను భగ్నం చేయడానికి అన్ని దేశాలు కలసికట్టుగా పనిచేయాలని ఇరు దేశాల నేతలు అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా ఈ పిలుపునిచ్చారు. పూర్తి స్థాయి ద్వైపాక్షిక సహకారంపై కేంద్రీకరించి చర్చలు జరిగాయని, తీర ప్రాంత రక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు భద్రత సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయని భారత ప్రధాని మోదీ ప్రకటించారు.

చిత్రం..ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ