జాతీయ వార్తలు

ఐదుగురికీ ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కుషాయిగూడ, డిసెంబర్ 19: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో మారణహోమం సృష్టించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ముజాహిదీన్ ముష్కర మూకకు ఎట్టకేలకు ఉరి ఖరారైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులు మహ్మద్ అహ్మద్ సాదిబాప అలియాస్ యాసిన్ భత్కల్ (ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు), పాక్ పౌరుడు జియా-ఉర్-రెహ్మాన్ అలియాస్ వకాస్, అసదుల్లా అక్తర్ అలియాస్ హిడ్డి, తహసీన్ అక్తర్ అలియార్ మోను, అజీజ్ షేక్‌లకు ఉరి శిక్ష ఖరారు చేస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. అయితే, ఉరి శిక్ష తీర్పును హైకోర్టు నిర్థారించాల్సి ఉంది. పేలుళ్లకు అసలు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉండటంతో, కేసు నుంచి అతని విచారణను వేరుచేసి దర్యాప్తు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
2013 ఫిబ్రవరి 21న నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ముష్కరులు దిల్‌సుఖ్‌నగర్‌లో ఐఇడి పేలుళ్లకు పాల్పడి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలో 18మంది సాధారణ పౌరులు మృత్యువాత పడగా, 138మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మూడున్నరేళ్ల విచారణ అనంతరం మారణహోమానికి కారకులు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని గత 13న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్థారించింది. శిక్షలను సోమవారం నిర్థారిస్తామన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు చర్లపల్లి జైలులోనే దోషులకు ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
కేసులో 157మంది సాక్షుల వాంగ్మూలం, 501 పత్రాలు, 173 వస్తు సాక్ష్యాలను ఎన్‌ఐఏ న్యాయస్థానానికి సమర్పించింది. మొత్తంగా మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా దోషులకు మరణ శిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోర్టును కోరింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వి శ్రీనివాసరావు పేలుళ్లకు కారకులైన ఐదుగురికి ఉరి శిక్ష విధించారు. తీర్పునకు సంబంధించి ఒక ప్రతిని ఎన్‌ఐఏ కోర్టు హైకోర్టుకు పంపించింది. వీరిపై ఐపిసి 302, 307, 324, 326, 124ఏ, 153ఏ, 120బిలతోపాటు పేలుళ్ల నిషేధ చట్టం ఐపిసి 3, 5, 16, 18, 20 సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలైంది. అయితే, తీర్పును హైకోర్టు నిర్ధారించాకే దోషులకు ఉరి శిక్ష ఖరారుకానుంది. కేసులో ఏ1గా రియాజ్ భత్కల్, ఏ2గా అసదుల్లా అఖ్తర్, ఏ3గా తహసీన్ అఖ్తర్, ఏ4 జియా ఉల్ రహమాన్ అలియాస్ వకాస్, ఏ5గా యాసిన్ భత్కల్, ఏ6గా అజాజ్ షేక్ ఉన్నారు. అయితే ఏ1గా ఉన్న రియాజ్ భత్కల్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంటున్నట్టు ఎన్‌ఐఏ గట్టిగా వాదించింది. ఇంటర్ పోల్ నోటీసు కూడా జారీ చేసినట్టు ఎన్‌ఐఏ పేర్కొంది.
మరణ శిక్ష సరైనదే..
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఎన్‌ఐఏ న్యాయస్థానం విధించిన మరణశిక్ష సరైందేనని కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమర్ధించింది. న్యాయస్థానంలో తుది వాదనలు పూరె్తైన తరువాతే, కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురికి ప్రత్యేక కోర్టు శిక్షలు ఖరారు చేసిందని ఎన్‌ఐఏ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్రరావు వెల్లడించారు. నేర తీవ్రతనుబట్టి దోషులకు మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టును కోరిన దరిమిలా దేశాన్ని అస్థిరపర్చే చర్యలకు పాల్పడినందుకుగాను ప్రత్యేక న్యాయస్థానం దోషులకు మరణశిక్ష విధించిందని తెలిపారు. ఇదిలావుంటే, ఉరిశిక్షకు సంబంధించి దోషుల అభిప్రాయాన్ని న్యాయమూర్తి అడిగినపుడు.. చట్టపరంగా ఎలా శిక్ష విధించినా తమకు అంగీకారమేనని చెప్పినట్టు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు.
గట్టి భద్రత.. ఉత్కంఠకు తెర
జంట పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం శిక్షలు ఖరారు చేయనుందన్న సమాచారంతో చర్లపల్లి జైలు వద్ద ఉదయం నుంచే ఉత్కంఠ కనిపించింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు వెలువరించే సమయంలో జైలు పరిసరాలను ప్రత్యేక పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. జైలు ఆవరణంలో ఆక్టోపస్, టాస్క్ఫోర్స్, ఎస్‌బిఐ, ఇంటలిజెన్స్ బలగాలు పెద్దఎత్తున మోహరించి, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కేసులో ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం తీర్పు ప్రక్రియపై కసరత్తు చేసి ఉరి శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే శిక్షలకు సంబంధించి ఇరువర్గాల వాదనలను న్యాయస్థానం పరిశీలించింది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు, హత్యలకు పాల్పడినందుకుగానూ న్యాయస్థానం దోషులందరికీ ఉరి శిక్ష విధించింది. దీనిపై దోషుల అభిప్రాయాన్ని కోరగా, తాము చెప్పేదేమీ లేదని, ఏ శిక్ష విధించినా సమ్మతమేనని తెలపడంతో దోషులకు మరణశిక్షా? లేక యావజ్జీవ శిక్ష విధిస్తారా అన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది.

చిత్రం..2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడిన ప్రాంతంలో ధ్వంసమైన దుకాణాలు, వాహనాలు