జాతీయ వార్తలు

ప్రచారాలతో వేడెక్కిన ఉత్తరప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియటంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానప్పటికీ ప్రచారానికి అన్ని పార్టీలు తెరతీసాయ. బిజెపి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయంసింగ్ యాదవ్ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంతో రాష్ట్ర శాసన సభ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించి ఆరోపణలు చేసుకున్నారు. కాన్పూర్‌లో బిజెపి ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షం నల్లధనం, అవినీతిపరులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అవినీతిపరులకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షం మూలంగానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయని ప్రధాని ధ్వజమెత్తారు. అవినీతిని అరికట్టడంతోపాటు నల్లధనాన్ని అదుపుచేసేందుకే ఎన్‌డిఏ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిందని ఆయన స్పష్టం చేశారు. మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఎద్దేవా చేసింది. తమ బండారం బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు అడ్డుపడిందని ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీలు తమకు అందే విరాళాల విషయంలో పారదర్శకత పాటించాలని ఆయన హితవు చెప్పారు. దేశంలోని కోట్లాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పెద్దనోట్లను రద్దు చేసినట్లు నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న గుండాయిజం, గుండా పాలన నుండి విముక్తి కావాలంటే బిజెపిని గెలిపించాలని మోదీ పిలుపు ఇచ్చారు.
మోదీ తాపత్రయమంతా ధనికుల కోసమే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం జౌన్‌పురిలో కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, ఎన్‌డిఏ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని కేవలం 50 ధనిక కుటుంబాలు, వారి వ్యాపారానికి మేలు చేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేసిందని ఆరోపించారు. ‘్ధనిక కుటుంబాలే మోదీకి విమానం సమకూర్చుతున్నాయ. అమెరికా, చైనా దేశాలకు మోదీ ఆ విమానంపై వెళ్లి ఆ వర్గం ప్రయోజనాలకోసం కృషి చేస్తున్నారు’ అని రాహుల్ నిప్పులు చెరిగారు. జనాక్రోష్ ర్యాలీలో మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది పేద ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేశారని దుయ్యబట్టారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తెచ్చి ప్రతి కుటుంబానికి వారి బ్యాంకుల్లో 15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తానన్న హామీ ఏమైందని రాహుల్ నిలదీశారు. నోట్లకోసం ప్రజలు గంటల కొద్దీ బ్యాంకుల వద్ద నిలబడుతుంటే ధనికులు మాత్రం కోట్లకు కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. కొత్త నోట్లకోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి అసువులు బాసినవారికి నష్ట పరిహారం చెల్లించాలని బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ తప్పుడు విధానాల మూలంగా కోట్లాది మంది పేద ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని ఆమె ఆరోపించారు. కాన్పూర్‌లో ఏర్పాటుచేసిన సభకు బిజెపి టికెట్లు ఆశిస్తున్నవారు కిరాయి మనుషులను తెచ్చారని మాయావతి ఆరోపించారు. బిజెపి ఎంత ప్రయత్నించినా ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ అధికారంలోకి రాలేదని ఆమె చెప్పారు.

చిత్రాలు..జౌన్‌పురిలో సోమవారం కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడుతున్న రాహుల్
కాన్పూర్‌లో బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న యుపి బిజెపి అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ వౌర్య